ఎన్టీఆర్ విగ్రహానికి నిప్పు పెట్టిన కేసులో.. ఇద్దరు నిందితుల అరెస్ట్
ABN , Publish Date - Jun 18 , 2026 | 05:59 AM
నల్లగొండ జిల్లాలో టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం ఎన్టీఆర్ విగ్రహానికి నిప్పుపెట్టిన కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
నిందితుల్లో ఒకరు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి
వివరాలు వెల్లడించిన నల్లగొండ జిల్లా ఎస్పీ
నల్లగొండ క్రైం, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లాలో టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం ఎన్టీఆర్ విగ్రహానికి నిప్పుపెట్టిన కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే ఉద్దేశ్యంతోనే వారు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైందని అధికారులు తెలిపారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ శరత్ చంద్రపవార్ ఈ కేసు వివరాలను వెల్లడించారు. నిందితుల్లో ఒకరైన పాలకూరి అశోక్‌కుమార్ గౌడ్ ప్రైవేట్ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తూ హైదరాబాద్‌లోని చైతన్యపురిలో నివసిస్తున్నాడు. ఈయన 2024లో జరిగిన వరంగల్- ఖమ్మం- నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 29వేల ఓట్లు సాధించడం గమనార్హం. రెండో నిందితుడు ఎలికంటి ప్రణీత్.. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ప్రైవేట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఈ నెల 6 తెల్లవారు జామున హైదరాబాద్ రోడ్డులో ఉన్న ఎన్టీఆర్ విగ్ర హం వద్దకు చేరుకున్న నిందితులు.. తమ వెంట తెచ్చుకున్న దుప్పట్లను విగ్రహంపై కప్పి పెట్రోల్ పోసి నిప్పంటించి పరారయ్యారు. ఘటనపై మున్సిపల్ అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన టూటౌన్ పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీ, సాంకేతిక ఆధారాలను విశ్లేషించి నిందితుల జాడను కనిపెట్టారు.