Share News

హత్య కేసులో రెండుసార్లు జీవిత ఖైదు

ABN , Publish Date - Mar 04 , 2026 | 12:37 AM

ఓ హత్య కేసులో నిందితుడికి రెండుసార్లు జీవిత ఖైదు విధిస్తూ నల్లగొండ జిల్లా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ ప్రత్యేక న్యాయస్థానం, రెండో అదనపు జిల్లా జడ్జి రోజారమణి మంగళవారం తీర్పు వెల్లడించారు.

హత్య కేసులో రెండుసార్లు జీవిత ఖైదు

హతుడి సోదరితో వివాహేతర సంబంధం

అడ్డొస్తున్నాడని హత్య చేసిన నిందితుడు

రెండు కేసుల్లో రూ.30 వేల జరిమానా

నల్లగొండ జిల్లా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు

నల్లగొండ క్రైం, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): ఓ హత్య కేసులో నిందితుడికి రెండుసార్లు జీవిత ఖైదు విధిస్తూ నల్లగొండ జిల్లా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ ప్రత్యేక న్యాయస్థానం, రెండో అదనపు జిల్లా జడ్జి రోజారమణి మంగళవారం తీర్పు వెల్లడించారు. జిల్లా ఎస్పీ శరత్‌చంద్రపవార్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నల్లగొండ జిల్లా కేంద్రంలోని తులసీనగర్‌కు చెందిన రమావత్‌ బాల వ్యవసాయం చేసుకుంటూ సోదరితో కలిసి పట్టణంలో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో బాల సోదరికి ఏపీ రాష్ట్రం కర్నూలు జిల్లా సంగెమాల మండలం కన్నాల గ్రామానికి చెందిన పాస్టర్‌ రామాపురం మల్లేశ్వర్‌రావు(రంగారెడ్డి జిల్లాలో నివాసం) రైలు ప్రయాణంలో పరిచయమయ్యాడు. అదికాస్త వారిద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది. తమ వివాహేతర సంబంధానికి బాల అడ్డొస్తున్నాడని భావించిన మల్లేశ్వర్‌రావు 2018 డిసెంబరు 12వ తేదీన నల్లగొండ రైల్వే ఓవర్‌ బ్రిడ్జి సమీపంలో రమావత్‌ బాలను(35) హత్య చేశాడు. ఈ ఘటనపై బాల సోదరి రామాపురం మల్లేశ్వర్‌రావుపై నల్లగొండ టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. సంఘటనా స్థలంలో లభించిన రక్తంతో తడిసిన బండరాయి, లుంగీ, ఇతర దుస్తులు, రక్త నమునాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబొరేటరీకి పంపించారు. ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదికలో డీఎన్‌ఏ విశ్లేషణ ద్వారా అవి నిందితుడివిగా నిర్థారించారు. శాస్త్రీయ ఆధారాలు, సాక్ష్యాలు, పరిశీలించిన కోర్టు నిందితుడిపై నేరాన్ని నిర్థారించి ఐపీసీ సెక్షన్‌ 302 కింద జీవిత ఖైదు, రూ.10వేల జరిమానా విధించింది.

ఎస్సీ, ఎస్టీ చట్టం కింద మరో జీవిత ఖైదు

బాధితురాలు ఎస్టీ కావడంతో మోసగించిన కేసులో ఎస్సీ, ఎస్టీ చట్టం కింద మరో జీవిత ఖైదు పాటు రూ.10వేల జరిమానా, ఐపీసీ సెక్షన్‌ 201 కింద మూడు సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10వేల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది. అన్ని శిక్షలు సమాంతరంగా అమలులో ఉంటాయని కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసును సమర్థంగా దర్యాప్తుచేసి నిందితుడికి కఠిన శిక్ష పడేలా చేసిన అప్పటి దర్యాప్తు అధికారులు డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి, సీఐ మహుబూబ్‌ పాషా, ఎస్‌ఐ నర్సింహులు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ అఖిల, ప్రస్తుత అధికారులు డీఎస్పీ శివరాంరెడ్డి, సీఐ రాఘవరావు, ఎస్‌ఐ సైదులు, సీడీవో సుమన్‌, కోర్టు లైసనింగ్‌ ఆఫీసర్స్‌ నరేందర్‌, మల్లికార్జున్‌లను ఎస్పీ అభినందించారు.

Updated Date - Mar 04 , 2026 | 12:37 AM