Share News

kumaram bheem asifabad- వాల్టా..పల్టా..

ABN , Publish Date - Apr 23 , 2026 | 11:32 PM

నీటి వినియోగం తారాస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో కొత్త బోర్ల తవ్వ కంపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. వాల్టా(వాటర్‌ లాండ్‌ అండ్‌ ట్రీస్‌ యాక్టు) చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. కానీ అమలు చేయడంలో కిందిస్థాయి అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కొంతమంది అధి కారులు బోర్ల తవ్వకాలకు సహకరిస్తూ వాల్టాకు తూట్లు పొడుస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి

kumaram bheem asifabad- వాల్టా..పల్టా..
లోగో

- చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు

బెజ్జూరు, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): నీటి వినియోగం తారాస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో కొత్త బోర్ల తవ్వ కంపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. వాల్టా(వాటర్‌ లాండ్‌ అండ్‌ ట్రీస్‌ యాక్టు) చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. కానీ అమలు చేయడంలో కిందిస్థాయి అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కొంతమంది అధి కారులు బోర్ల తవ్వకాలకు సహకరిస్తూ వాల్టాకు తూట్లు పొడుస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో పలు మండలాల్లో బోర్లలో నీరు అడుగంటిపోతున్నాయి. దీంతో రైతులు, ప్రజలు అనుమతి తీసుకోకుండా అప్పులు చేసి ఇష్టానుసారంగా బోర్ల తవ్వకాలు చేపడుతున్నారు.

- పదుల సంఖ్యలో..

జిల్లాలో ప్రతినిత్యం పదుల సంఖ్యలో బోర్లు వేస్తున్నారు. బోర్లు వేస్తున్నామని ఎక్కడ కూడా అనుమతి తీసుకోకపోవడం గమనార్హం. అధికారులు కూడా చర్యలు తీసుకోవడం లేదు. ఎక్కడో పొలాల్లో వేస్తున్న బోర్ల గురించి తమకు సమాచారం ఉండటం లేదని దీంతో పరిశీలన చేయడం ఇబ్బందిగా మారిందని పలువురు తహసీల్దార్లు చెబుతున్నారు. బోరు తవ్వకం చేసే యజమానులు తప్పకుండా అనుమతి పొందాల్సిన అవసరం ఉందని అధికారులు సూచిస్తున్నారు. పంట పొలాల్లో వేసే బోర్ల తవ్వకాలకు కచ్చితంగా అనుమతి తీసుకోవాలన్న నిబంధన ఉన్నా ఎక్కడా పాటించడం లేదు. ఒక బోరు తవ్వాలంటే ముందుగా సంబంధిత తహసీల్దార్ల వద్ద అనుమతి తీసుకోవాలి. బోరు తవ్వకం ప్రాం తంలో నీరుందో లేదో తెలుసుకోవడానికి భూగ ర్భజల శాఖ అధికారులను సంప్రదించాలి. ఈ రెండు శాఖల అధికారుల అనుమతి తీసుకున్న తర్వాత బోరు తవ్వాలి. బోరుకు మద్య 500మీటర్ల దూరం ఉండాలి. బోరు పడక పోతే రైతులు ఆర్థికంగా చితికి పోకూడదన్న ఉద్దేశ్యంతో ఈ నిబంధనలు విధించారు. కానీ దీన్ని యజమానులు పట్టించుకోవడం లేదు.

- నియమాలు ఇలా..

భూగర్భజల శాఖ అనుమతి పొందాకే రిగ్‌ వినియో గించాలనే నిబంధన పెట్టారు. అనుమతి ఇస్తే ఫార్మ్‌-2 తహసీల్దార్‌ ద్వారా తీసుకెళ్లాల్సి ఉంటుంది. రెవెన్యూ సిబ్బంది గ్రామాలకు వెళ్లి పరిశీలిస్తారు. బోరు బోరుకు 500మీటర్లు ఉంటేనే తవ్వకానికి అనుమతి ఇస్తారు. ట్రాన్స్‌కో అధికారుల ద్వారా విద్యుత్తు సర్వీసు ఇవ్వడానికి నిరభ్యంతర ద్రువీకరణ పత్రం తీసుకోవాలి.

అనుమతులు తీసుకోవాలి..

- రామ్మోహన్‌, తహసీల్దార్‌, బెజ్జూరు

పంటపొలాలు, ఇండ్ల వద్ద బోర్లు వేయడానికి యజమానులు తప్పనిసరిగా సంబంధిత అధికారుల అనుమతులు పొందాలి. అనుమతులు లేకుండా బోర్ల తవ్వకాలు చేపడితే సంబంధిత వాహనాలను సీజ్‌ చేస్తాం. యజమానులపై చట్టరిత్యా చర్యలు తీసుకుంటాం. ఎక్కడ బోరు తవ్వకాలు చేపడతారో ముందుగా సమాచారం ఇవ్వాలి. ఆ తర్వాతే బోర్ల తవ్వకాలకు అనుమతులు ఇస్తాం.

Updated Date - Apr 23 , 2026 | 11:32 PM