Share News

కమలంలో కలకలం..

ABN , Publish Date - Sep 03 , 2026 | 01:14 AM

జిల్లాలో భారతీయ జనతాపార్టీలో అంతర్గత విభేదాలు పార్టీ శ్రేణుల్లో తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. పార్టీ లైన్‌ దాటి వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరు నాయకులపై చర్యలు తీసుకోవడం లేదంటూ పలువురు కార్యకర్తల్లో అసంతృప్తి నెలకొంది. నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు అనుకూలంగా

కమలంలో కలకలం..

జగిత్యాల, సెప్టెంబరు2 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో భారతీయ జనతాపార్టీలో అంతర్గత విభేదాలు పార్టీ శ్రేణుల్లో తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. పార్టీ లైన్‌ దాటి వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరు నాయకులపై చర్యలు తీసుకోవడం లేదంటూ పలువురు కార్యకర్తల్లో అసంతృప్తి నెలకొంది. నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు అనుకూలంగా ఓ వర్గం, వ్యతిరేకంగా మరో వర్గంగా పార్టీ చీలిందన్న అభిప్రాయాలున్నాయి. జగిత్యాల, కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొందరు ద్వితీయ శ్రేణి బీజేపీ నేతలు పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని అధిష్ఠానానికి ఫిర్యాదులు వెళ్లాయి. అయినప్పటికీ స్పందన లేకపోవడంతో ఇక నేరుగా హైకమాండ్‌ ఎదుటే తమ గోడు వెళ్లబోసుకోవాలని కొందరు పార్టీ నాయకులు నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ వర్గానికి వ్యతిరేకంగా కొందరు ద్వితీయ శ్రేణి నాయకులు ఇటీవల కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని మల్లాపూర్‌ మండలం సాతారంలో ఓ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మూడు, నాలుగు రోజులుగా ఈ సమావేశంపై పార్టీ శ్రేణుల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఎంపీ అర్వింద్‌ వర్గానికి వ్యతిరేకంగా కొందరు నేతలు సమీకృతమవుతున్నారనే ప్రచారం జిల్లాలో చోటుచేసుకుంది. ఈ పరిణామాల వెనుక పార్టీ అగ్రనేతల పేర్లు చర్చల్లో వినిపిస్తున్నాయి.

ఫరాజధానికి వెళ్లడానికి ఓ వర్గం సన్నాహాలు

అసంతృప్తి రాజకీయాల్లో భాగంగా రెండు రోజుల క్రితం 500 వాహనాల్లో కొందరు నాయకులు హైదరాబాద్‌కు వెళ్లేందుకు సన్నాహాలు చేసినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. అయితే చివరి సమయంలో అధిష్ఠానం జోక్యంతో తాత్కాలికంగా హైదరాబాద్‌లో నిరసన కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నట్లు పార్టీ శ్రేణులు చర్చించు కుంటున్నాయి. కమల పార్టీలో చోటుచేసుకున్న అసంతృప్తి వ్యవహారం జగిత్యాల జిల్లాతో పాటు నిజామాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని బీజేపీలో రాజకీయ వేడిని రాజేస్తోంది. పార్టీ కోసం ఏళ్ల తరబడి పనిచేస్తున్న కార్యకర్తలను పక్కనపెట్టి, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి ప్రాధాన్యం ఇవ్వడం ఏమిటని పలువురు నాయకులు ప్రశ్నిస్తున్నారు. పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని త్వరలో హైకమాండ్‌ను కలిసి డిమాండ్‌ చేయనున్నట్లు సమాచారం.

ఫఫిర్యాదులు వెళ్లినా చర్యలేవి?

బీజేపీలో కొంతకాలంగా కొనసాగుతున్న అంతర్గత విభేదాలు ఇప్పుడు రాష్ట్ర నాయకత్వం దృష్టికి చేరినట్లు తెలుస్తోంది. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సురభి నవీన్‌కుమార్‌, జిల్లా నాయకుడు ముదుగంటి రవీందర్‌రెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షుడు మోరేపల్లి సత్యనారాయణరావు, కోరుట్ల బీజేపీ నేత సురభి నవీన్‌లపై పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ పలుమార్లు ఫిర్యాదులు వెళ్లినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. స్థానికంగా చోటుచేసుకున్న పలు ఘటనలను రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.

ఫజగిత్యాల బీజేపీ నేత బోగ శ్రావణి ఇంటిపై దాడి చర్చల్లోకి...

మూడు నెలల క్రితం ఎంపీ అర్వింద్‌ జిల్లా కేంద్రంలో పర్యటన సందర్భంగా జగిత్యాల నియోజకవర్గ ఇన్‌చార్జి భోగ శ్రావణి ఇంటిపై జరిగిన దాడి ఘటన, నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు వ్యతిరేకంగా నిర్వహించినట్లు చెబుతున్న మీడియా సమావేశాలు, కొందరు బీజేపీ నాయకులు ప్రత్యర్థి పార్టీల నేతలతో సన్నిహితంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ప్రధానంగా ఫిర్యాదుల్లో ప్రస్తావించిన అంశాలుగా తెలుస్తోంది. దాడి సంఘటన వెనుక ఎవరు ఉన్నారు.. ఎవరి పాత్ర ఎంత ఉంది... తేలాల్సి ఉంది. అయితే ఈ ఆరోపణలు, ఫిర్యాదులపై ఇప్పటి వరకు రాష్ట్ర నాయకత్వం నుంచి స్పష్టమైన చర్యలు కనిపించకపోవడమే కాషాయ శ్రేణుల్లో అసంతృప్తికి ప్రధాన కారణంగా మారినట్లు సమాచారం.

ఫఆధిపత్య పోరుపై చర్చ...

తమ కార్యక్రమాలకు కేంద్ర, రాష్ట్ర స్థాయి ప్రముఖ నాయకుల అండ ఉందంటూ కొందరు నాయకులు చేస్తున్న ప్రచారం కూడా పార్టీలో కొత్త చర్చకు తెరలేపింది. పార్టీ నాయకత్వం పేర్లను ఉపయోగించుకొని స్థానికంగా తమ ఆధిపత్యాన్ని పెంచుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయా? లేక నిజంగానే వారికి పెద్దల మద్దతు ఉందా? అన్న చర్చ బీజేపీ వర్గాల్లో సాగుతోంది. బీజేపీలో చోటుచేసుకుంటున్న అంతర్గత విభేదాల వెనుక జిల్లాకు చెందిన ఓ కీలక ప్రజాప్రతినిధి ‘హస్త’ రాజకీయం ఉన్నట్లుగా విమర్శలు వినిపిస్తున్నాయి. కొందరు కమల నాథులతో చనువుగా వ్యవహరించే సదరు కీలక ప్రజాప్రతినిధి ఓ వర్గాన్ని ప్రోత్సహిస్తూ తనదైన రాజకీయ ప్రయోజనాలు పొందాలని ప్రయత్నిస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఫగ్రూపు రాజకీయాలతో గుబులు

జిల్లాలో బీజేపీ బలపడుతున్న సమయంలో గ్రూపు రాజకీయాలు పార్టీకి నష్టం చేస్తున్నాయనే ఆందోళన కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది. ఓ వర్గం వాల్‌పోస్టర్లు ఇటీవల సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. పోస్టర్‌ వివాదాలు, నాయకుల మధ్య బహిరంగ విభేదాలు, కార్యకర్తల మధ్య పెరుగుతున్న దూరం పార్టీకి ఇబ్బందికరంగా మారుతోందని పార్టీ శ్రేణులు అంటున్నాయి. పార్టీని బలోపేతం చేయాల్సిన నాయకులే వర్గాలను ప్రోత్సహిస్తే సామాన్య కార్యకర్త పరిస్థితి ఏమిటని కాషాయ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి.

ఫహైకమాండ్‌ నిర్ణయమే కీలకం...

కమల పార్టీలో పరిణామాలతో జగిత్యాల బీజేపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇరు వర్గాలు ప్రత్యేకంగా వాహనాలు ఏర్పాటు చేసుకొని హైదరాబాద్‌కు వెళ్లడానికి సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తల కంటే వివాదాల్లో ఉన్న నాయకులకే ప్రాధాన్యత ఇస్తే క్షేత్రస్థాయిలో పార్టీకి నష్టం తప్పదని అసమ్మతి వర్గం హెచ్చరిస్తోంది. మరోవైపు ఈ వివాదాన్ని రాష్ట్ర నాయకత్వం ఎలా పరిష్కరిస్తుందన్నదే ఇప్పుడు జిల్లా బీజేపీ రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. కమలంలో కొనసాగుతున్న ఈ అంతర్గత కలకలం... కేంద్ర, రాష్ట్ర నాయకత్వం దృష్టి సారించడంతో ఎలాంటి మలుపు తిరుగుతుందో వేచి చూడాల్సిందే..!

Updated Date - Sep 03 , 2026 | 01:14 AM