కరీంనగర్‌లో మాదిగలతో భారీ కవాతు చేస్తా
ABN , Publish Date - Mar 16 , 2026 | 04:04 AM
నేను కరీంనగర్ వస్తా.. మాదిగలతో భారీ కవాతు చేస్తా.. దమ్ముంటే చూసుకుందాం.. బండి సంజయ్ కబడ్దార్’ అని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ సవాల్ విసిరారు....
తుంగతుర్తికి వస్తే జనం నిన్ను తుంగలో తొక్కుతారు
బండి సంజయ్‌కు ఎమ్మెల్యే సామేల్ వార్నింగ్
హైదరాబాద్, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): ‘నేను కరీంనగర్ వస్తా.. మాదిగలతో భారీ కవాతు చేస్తా.. దమ్ముంటే చూసుకుందాం.. బండి సంజయ్ కబడ్దార్’ అని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ సవాల్ విసిరారు. గాంధీభవన్‌లో ఆదివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తుంగతుర్తికి వచ్చి తనను ఓడిస్తానన్న సంజయ్ మాటలకు ఆయన స్పందిస్తూ... ఇక్కడికి వస్తే ప్రజలు నిన్ను తుంగలో తొక్కడం ఖాయమని హెచ్చరించారు. తాను బ్రాహ్మణులను కించపరిచానన్న ఆరోపణలను సామెల్ ఖండించారు. తన మాటలు తన వ్యక్తిగతమని స్పష్టం చేశారు. బండి సంజయ్‌కు నిజంగా వారిపై ప్రేమ ఉంటే తిండిలేక అల్లాడుతున్న పేద బ్రాహ్మణులను ఆదుకోవాలన్నారు. తనపై క్రిమినల్ కేసులు పెట్టడం కాదు.. దళితులను అవమానించిన బండి సంజయ్‌పై కేసులు పెట్టాలన్నారు. బీజేపీ ప్రభుత్వంలో ఒక్క ఎస్సీ మంత్రినైనా చూపించగలరా? అని నిలదీశారు. రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఐదుగురు దళిత మంత్రులు ఉన్నారని పేర్కొన్నారు.