Share News

తుమ్మిడిహెట్టి నుంచి సుందిళ్లకు జలాలు

ABN , Publish Date - May 07 , 2026 | 04:46 AM

ప్రాణహిత-చేవెళ్ల ఎత్తిపోతల పథకంలో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించతలపెట్టిన బ్యారేజీ నుంచి తొలుత సుందిళ్లకు జలాలను తరలించి...

తుమ్మిడిహెట్టి నుంచి సుందిళ్లకు జలాలు

  • అక్కడి నుంచే ఎల్లంపల్లికి.. ఖరారైన అలైన్‌మెంట్‌

హైదరాబాద్‌, మే 6 (ఆంధ్రజ్యోతి): ప్రాణహిత-చేవెళ్ల ఎత్తిపోతల పథకంలో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించతలపెట్టిన బ్యారేజీ నుంచి తొలుత సుందిళ్లకు జలాలను తరలించి... అక్కడి నుంచి శ్రీపాద ఎల్లంపల్లికి ఎత్తిపోయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తుమ్మిడిహెట్టి వద్ద 150 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ కట్టినప్పటికీ గ్రావిటీతో శ్రీపాద ఎల్లంపల్లికి ఆశించిన మేర నీటిని తరలించలేమని తాజాగా ప్రభుత్వం గుర్తించింది. ఇక తుమ్మిడిహెట్టి నుంచి శ్రీపాద ఎల్లంపల్లి అలైన్‌మెంట్‌లో మైలారం దాకా 71.5 కిలోమీటర్ల మేర గ్రావిటీ కెనాల్‌ 2015 కంటే ముందే పూర్తయింది. అయితే మైలారం వద్ద పంప్‌హౌస్‌ నిర్మించి అక్కడినుంచి శ్రీపాద ఎల్లంపల్లికి నీటిని పంపింగ్‌ చేయాలనేది గతంలోని అలైన్‌మెంట్‌లో ఉంది. అయితే గత ప్రభుత్వం తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణాన్ని పక్కనపెట్టి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను కట్టింది. ఆ మూడు చోట్ల కన్నెపల్లి(మేడిగడ్డ), సిరిపురం(అన్నారం), గోలివాడ(సుందిళ్ల) పంప్‌హౌ్‌సలను నిర్మించింది. 2023 అక్టోబరులో మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోగా... ఆ తర్వాత అన్నారం, సుందిళ్లలో సీపేజీలు బయటపడ్డాయి. వీటిని పరిశీలించిన నిపుణులు అన్నారం, సుందిళ్లలో సీపేజీల కట్టడికి గ్రౌటింగ్‌ సరిపోతుందని పేర్కొన్నారు. అయితే మైలారం నుంచి సుందిళ్లకు నీటిని తరలించి. అక్కడి నుంచి శ్రీపాద ఎల్లంపల్లికి ఎత్తిపోయడం మేలని వారు సూచించగా.. ఈమేరకు సీఎం రేవంత్‌రెడ్డి, నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అలైన్‌మెంట్‌పై ఆమోద ముద్ర వేసినట్లు తెలిసింది. ఇక తుమ్మిడిహెట్టిని 150 మీటర్ల ఎత్తుతో కట్టడానికి వీలుగా సమ్మతి కోరుతూ మహారాష్ట్ర సీఎంకు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లేఖ రాశారు. ఈ మేరకు సమ్మతి లభిస్తే తుమ్మిడిహెట్టి డీపీఆర్‌కు తుదిరూపు ఇచ్చి...అనుమతుల కోసం కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ)లో దాఖలు చేయనున్నారు. ఇక నెలరోజుల్లో ప్రాజెక్టు ప్రాథమిక సాధ్యాసాధ్యాల నివేదిక(పీఎ్‌ఫఆర్‌) ఖరారు కానుండగా... రెండునెలల్లోపు డీపీఆర్‌ సైతం సిద్ధం కానుంది.

Updated Date - May 07 , 2026 | 04:46 AM