ఓర్వలేకే బీఆర్‌ఎస్ నేతల విమర్శలు!
ABN , Publish Date - Apr 11 , 2026 | 04:58 AM
తమది రైతుల ప్రయోజనాలకు పెద్దపీట వేసే ప్రభుత్వం అని, వారికి ఇచ్చిన మాటకు కట్టుబడి నిర్ణయాలు తీసుకుంటున్నామని వ్యవసాయశాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
ఆర్థిక స్థితి అస్తవ్యస్తంగా ఉన్నా ఇచ్చిన మాటకు కట్టుబడి రైతులకు ఒకేసారి రూ. 2లక్షల రుణమాఫీ చేశాం
మీరు రుణమాఫీ ఎలా చేశారో అన్నదాతలకు ఇంకా గుర్తుంది: తుమ్మల
హైదరాబాద్, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి): తమది రైతుల ప్రయోజనాలకు పెద్దపీట వేసే ప్రభుత్వం అని, వారికి ఇచ్చిన మాటకు కట్టుబడి నిర్ణయాలు తీసుకుంటున్నామని వ్యవసాయశాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్నప్పటికీ, ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి 2 లక్షల లోపు ఉన్న పంట రుణాలను మాఫీ చేశామని, తద్వారా చేసి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నట్లు తెలిపారు. ఎన్నో రాష్ట్రాలు ఆర్థికంగా బలంగా ఉన్నప్పటికీ ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకోలేకపోయాయన్నారు. గత బీఆర్‌ఎస్ సర్కారు ఏ విధంగా రుణమాఫీ చేసిందనేది రైతులకు ఇంకా గుర్తుందని ఎద్దేవా చేశారు. రైతులకు తమ ప్రభుత్వం చేస్తున్న ప్రయోజనాలను చూసి ఓర్వలేకే బీఆర్‌ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారని ఆక్షేపించారు. బీఆర్‌ఎస్ నేతల విమర్శలు పూర్తిగా అర్థరహితమైనవని.. ప్రభుత్వాన్ని మెచ్చుకోకపోయినా పర్వాలేదు గానీ విమర్శలు మానుకోవాలని హితవు పలికారు. ఈమేరక ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. బీఆర్‌ఎస్ 2014లో అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్రం మిగులు బడ్జెట్‌తో ఉందని, అయినప్పటికీ రూ.లక్ష వరకు రుణమాఫీని ఒకేసారి చేయలేక పోయారని అన్నారు. ఫలితంగా రైతులకు రుణమాఫీ కాకపోగా.. రూ. 2,630 కోట్ల వడ్డీ భారం పడిందన్నారు. అయినప్పటికీ రైతులు నమ్మి బీఆర్‌ఎ్‌సకు రెండోసారి అధికారం అప్పగిస్తే 2018-23 వరకు అధికారంలో ఉండి మరోసారి రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేశారని విమర్శించారు. 2018లో లక్ష వరకు పంట రుణమాఫీ చేస్తామని చెప్పి, దానిని దశలవారీగా అమలు చేయడం ద్వారా రూ. 8,515 కోట్ల వడ్డీభారం పడటంతో పాటు, రూ. 8,379 కోట్లు పూర్తిగా ఎగ్గొట్టారని విమర్శించారు. అంతేకాకుండా రూ. 1,419 కోట్ల నిధులు ఖాతాలు సరిగ్గా లేనందున వెనక్కి వెళ్లిపోయాయని పేర్కొన్నారు. అధికారంలో ఉన్న పదేళ్ల పాటు రైతులను నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వం ఇప్పుడు రైతులపై ప్రేమ నటించడం కపటత్వానికి నిదర్శమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి రాగానే రైతులకు ఇచ్చిన మాటకు కట్టుబడి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని, రైతులకు ఎలాగైనా ఒకేసారి పంట రుణమాఫీ చేయాలనే కృతనిశ్చయంతో రూ. 20,616.89 కోట్ల పంట రుణమాఫీని చేశామని తుమ్మల తెలిపారు. రుణమాఫీతో 25,35,964 మంది రైతులు లబ్థిపొందారని మంత్రి తుమ్మల అన్నారు. ప్రస్తుతం బీఆర్‌ఎస్ నాయకులు ప్రభుత్వంపై విమర్శలు చేయడం తప్ప మరే పని చేయడం లేదని, తద్వారా రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.