Share News

పంటల మద్దతు ధర పథకం ఏది?

ABN , Publish Date - Apr 20 , 2026 | 05:58 AM

‘‘పదేళ్లలో రైతుల నికర ఆదాయం రెట్టింపు చేస్తామని ప్రగల్భాలు పలికిన కేంద్ర ప్రభుత్వం.. పుష్కర కాలం గడిపి రైతుల సహనానికి పరీక్ష పెడుతున్నది.

పంటల మద్దతు ధర పథకం ఏది?

  • ప్రకటనలకే పరిమితమవుతున్న కేంద్రం: తుమ్మల

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి): ‘‘పదేళ్లలో రైతుల నికర ఆదాయం రెట్టింపు చేస్తామని ప్రగల్భాలు పలికిన కేంద్ర ప్రభుత్వం.. పుష్కర కాలం గడిపి రైతుల సహనానికి పరీక్ష పెడుతున్నది. పంట ఉత్పత్తుల కొనుగోళ్లపై పరిమితులు విధిస్తూ రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నది. పంటల మద్దతు ధర పథకాన్ని కేవలం ప్రకటనలకే పరిమితం చేసింది’’ అని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. ఈమేరకు ఆదివారం ఆయన కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. మొక్కజొన్న పంటను కొనుగోలు చేయడానికి కేంద్రం ఈ సీజన్‌లో అయినా ముందుకు రావాలని, శనగ, పొద్దుతిరుగుడు పంటలపై ఉన్న 25ు పరిమితిని ఎత్తివేసి, పూర్తిగా కొనుగోలు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో అధికంగా దిగుబడి అవుతున్న ధాన్యం సేకరణను ప్రతి సంవత్సరం తగ్గించడం, దొడ్డు బియ్యం సేకరణ విషయంలో మాట మార్చడంతో రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ తీరుతో రైతులు తమ పంటను ఎక్కడ అమ్ముకోవాలో తెలియని స్థితిలో ఉన్నారని, బహిరంగ మార్కెట్లో మద్దతు ధర లభించక ఆర్థికంగా నష్టపోతున్నారని తెలిపారు. ఖరీఫ్‌ సీజన్‌లో మొక్కజొన్న పంట మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం సేకరించిందని, యాసంగిలో కేంద్రం కొనుగోళ్లకు అనుమతిస్తుందని ఆశించినప్పటికీ, ఎలాంటి స్పందన రాలేదన్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 200కు పైగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి, 1.20 లక్షల మెట్రిక్‌ టన్నుల పంటను మద్దతు ధరకు కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటికైనా పంట ఉత్పత్తులు మొత్తం కొనుగోలుచేసి.. ప్రభుత్వానికి మద్దతు అందించాలని తుమ్మల లేఖ ద్వారా మరోమారు కేంద్రాన్ని కోరారు.

Updated Date - Apr 20 , 2026 | 06:00 AM