Share News

తెలంగాణ అంటేనే కేంద్రానికి కక్ష

ABN , Publish Date - May 05 , 2026 | 03:44 AM

తెలంగాణ రాష్ట్రమంటేనే కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, రైతులు పండించిన పంటలను కొనుగోలు చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు మండిపడ్డారు.

తెలంగాణ అంటేనే కేంద్రానికి కక్ష

  • పంటలు కొనకుండా కక్ష సాధింపు : మంత్రి తుమ్మల

తాండూరు/హైదరాబాద్‌, మే 4 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రమంటేనే కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, రైతులు పండించిన పంటలను కొనుగోలు చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు మండిపడ్డారు. సోమవారం వికారాబాద్‌ జిల్లా తాండూరులో సేంద్రియ ఉత్పత్తుల యాప్‌ను ప్రారంభించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలోనే మక్కలను కొనుగోలు చేస్తున్నామని, కేంద్రం మాత్రం రాష్ట్రానికి కనీసం యూరియాను కూడా సక్రమంగా ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, వారు చేయాల్సిన పనులు వదిలేసి రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లే యత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రైతులు పండించిన పంటను పూర్తిస్థాయి మద్దతు ధరతో కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. నాఫెడ్‌ ద్వారా పప్పు ధాన్యాలు కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్రానికి ఉన్నా.. నిబంధనల పేరుతో 25శాతం మాత్రమే తీసుకుంటోందని విమర్శించారు. మొక్కజొన్న, జొన్న పంటలను మద్దతు ధర పథకంలో చేర్చాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌కు విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వ నోడల్‌ ఏజెన్సీల ద్వారా ఈ పంటలను కొనుగోలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆయనకు ఓ లేఖ రాశారు.

Updated Date - May 05 , 2026 | 03:44 AM