మార్కెట్ యార్డుల్లో వసతులు సమకూర్చాలి: తుమ్మల
ABN , Publish Date - Feb 26 , 2026 | 02:58 AM
రాష్ట్రంలో అకాల వర్షాలు పడుతున్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు..
హైదరాబాద్, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అకాల వర్షాలు పడుతున్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో రైతుల ఉత్పత్తులకు నష్టం కలగకుండా సంరక్షించేందుకు పాలకవర్గాలు, ఆ శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతం వ్యవసాయ ఉత్పత్తుల రాకపోకలు అధికంగా సాగుతున్న దృష్ట్యా, ఆకస్మిక వాతావరణ మార్పులు, అధిక తేమ, పురుగు సమస్యలు, అగ్ని ప్రమాదాలు, ఇతర సమస్యలతో మౌలిక సదుపాయాల పరంగా తాత్కాలిక నిల్వ కోసం చర్యలు తీసుకోవాలని సూచించారు. గోదాములు, కవర్ షెడ్లు అందుబాటులో ఉంచాలని, టార్పాలిన్లు ఉచితంగా అందించాలని, ఉత్పత్తులను నేరుగా నేలపై నిల్వ చేయకుండా చెక్క పలకలు, ఎత్తైన వేదికలపై ఉంచాలని ఆయన సూచించారు.