కేంద్ర ప్రభుత్వ విధానాలే అన్నదాతలకు శాపం
ABN , Publish Date - May 19 , 2026 | 05:08 AM
వ్యవసాయ రంగంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు రైతులకు శాపంగా మారుతున్నాయని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు.
రైతులకు ఆర్థిక భరోసా కల్పించే విధానాలే లేవు
బీజేపీ నేతలు వాస్తవాలను వక్రీకరిస్తున్నారు:తుమ్మల
హైదరాబాద్, మే 18(ఆంధ్రజ్యోతి): వ్యవసాయ రంగంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు రైతులకు శాపంగా మారుతున్నాయని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. పంటలకు గిట్టుబాటు ధర, మార్కెట్ భరోసా, దిగుమతుల నుంచి రక్షణ, ఉత్పత్తి వ్యయాల నియంత్రణలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. బీజేపీ నాయకులు ఈ వాస్తవాలను గ్రహించకుండా అన్నింటిని వక్రీకరిస్తూ ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీలు కేంద్రమే ధాన్యం సేకరిస్తున్నట్లు, ఖర్చును భరిస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారని, ఇది ఏమాత్రం నిజం కాదన్నారు. వరి, మొక్కజొన్న, కంది, జొన్న, పెసర, సోయాబీన్, పొద్దు తిరుగుడు, పత్తి, పామాయిల్ పంటలు రాష్ట్రంలో విస్తృతంగా సాగవుతున్నా కేంద్రం వైఖరితో రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. వరి ధాన్యానికి కేంద్రం ఎమ్మెస్పీ(రూ. 2,300) ప్రకటించి వదిలేస్తే, రాష్ట్ర ప్రభుత్వం అదనంగా క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తోందని తుమ్మల గుర్తుచేశారు. మొక్కజొన్న, జొన్న పంటలను ధరల మద్దతు పథకం’(ప్రైస్ సపోర్ట్ స్కీమ్) పరిధిలోకి ఎందుకు తీసుకు రావటం లేదని, స్వామినాథన్ కమిటీ సిఫారసులును కేంద్రం ఎందుకు అమలు చేయటం లేదని ప్రశ్నించారు.