బీఆర్‌ఎస్ హయాంలో ఆర్థిక విధ్వంసం.. వ్యవస్థల నాశనం
ABN , Publish Date - Feb 10 , 2026 | 04:32 AM
బీఆర్‌ఎస్ పాలనలో ఆర్ధిక విధ్వంసంతోపాటు అన్ని వ్యవస్థలు వినాశనమయ్యాయని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.
కాంగ్రె్‌సదే భవిష్యత్తు.. మళ్లీ సీఎం రేవంతే: మంత్రి తుమ్మల
సత్తుపల్లి, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ పాలనలో ఆర్ధిక విధ్వంసంతోపాటు అన్ని వ్యవస్థలు వినాశనమయ్యాయని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మునిసిపాలిటీ పరిధిలో సోమవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ.. ఆర్థిక విధ్వంసం.. సంస్థల వినాశనం తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రేవంత్ రెడ్డి.. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూనే ఇచ్చిన హామీల అమలుకు నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు సజావుగా సాగుతుంటే బీఆర్‌ఎస్ నేతలు బ్రోకర్ మాటలు, అబద్ధాలు చెబుతున్నారని ఆయన మండి పడ్డారు. రాష్ట్ర వినాశనానికి కారణమైన బీఆర్‌ఎ్‌సకు భవిష్యత్తు లేదన్న మంత్రి తుమ్మల.. భవిష్యత్తు కాంగ్రె్‌సదేనని, మళ్లీ రేవంత్ రెడ్డి సీఎం అవుతారని స్పష్టం చేశారు. మునిసిపల్ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అన్ని మునిసిపాలిటీలు, నగర పాలక సంస్థలను గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.