Share News

వెలుగుమట్ల మోడల్‌ కాలనీకి భూమిపూజ

ABN , Publish Date - Mar 13 , 2026 | 05:12 AM

ఖమ్మం కలెక్టరేట్‌ సమీపంలోని వెలుగుమట్లలో ఇటీవల ఇళ్లు కోల్పోయిన పేదల కోసం అదే ప్రాంతంలో నిర్మిస్తున్న మోడల్‌ కాలనీకి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు గురువారం భూమిపూజ చేశారు.

వెలుగుమట్ల మోడల్‌ కాలనీకి భూమిపూజ

  • లబ్ధిదారులతో కలిసి భూమిపూజ చేసిన మంత్రి తుమ్మల

  • డిసెంబరు 9 నాటికి పూర్తిచేసి ప్రారంభిస్తామని వెల్లడి

ఖమ్మం, మార్చి12 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఖమ్మం కలెక్టరేట్‌ సమీపంలోని వెలుగుమట్లలో ఇటీవల ఇళ్లు కోల్పోయిన పేదల కోసం అదే ప్రాంతంలో నిర్మిస్తున్న మోడల్‌ కాలనీకి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు గురువారం భూమిపూజ చేశారు. లబ్ధిదారులతో కలిసి 38 ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోర్టు ఆదేశాలతో భూదాన్‌ భూముల్లో ఇళ్లను తొలగించి అర్హులైన పేదలకు మోడల్‌ కాలనీ నిర్మించి ఇస్తున్నామని తెలిపారు.వెలుగుమట్ల భూదాన్‌ భూమిని కొందరు ఆక్రమించి గత పదేళ్లుగా పేదల సంఘం పేరుతో ప్లాట్లు చేసి విక్రయించారని మంత్రి తుమ్మల ఆరోపించారు. ఒకే ప్లాటును పది మందికి విక్రయించి పేదల జీవితాలతో ఆడుకున్నారని, బాధితులను కాపాడేందుకే కొంత కఠినంగా వ్యవహరించి అక్రమ నిర్మాణాలను తొలిగించినట్లు తెలిపారు. గతంలో ఇక్కడ సర్వే కోసం అధికారులు, పోలీసులు వస్తే దళారులు పేదల ముసుగులో దాడులు చేశారని ఆరోపించారు. వారిని కఠినంగా శిక్షిస్తామని తేల్చి చెప్పారు. డిసెంబరు 9న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతులమీదుగా ఈ మోడల్‌ కాలనీని ప్రారంభిస్తామని చెప్పారు. కాగా, రాష్ట్రంలో బఫర్‌ నిల్వల ఏర్పాటుకు సరిపడా ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల్లో ప్రతి నెల 2 లక్షల మెట్రిక్‌ టన్నుల చొప్పున 6 లక్షల టన్నుల యూరియా కేటాయించాలని కేంద్రమంత్రి జేపీ నడ్డాకు విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.

Updated Date - Mar 13 , 2026 | 05:12 AM