Share News

అగ్రి బిజినెస్‌ పార్క్‌కు సహకరించండి

ABN , Publish Date - Sep 30 , 2026 | 05:45 AM

పప్పుధాన్యాల సాగులో 36శాతం వృద్ధి రేటుతో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో నిలిచిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యతకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లేలా రైతులను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు

అగ్రి బిజినెస్‌ పార్క్‌కు సహకరించండి
TummalaNageshwarrao

  • పప్పుధాన్యాల సాగు వృద్ధిలో ముందున్నాం

  • తెలంగాణకు 16 కృషి విజ్ఞాన కేంద్రాలు ఇవ్వండి

  • మొక్కజొన్న, జొన్నను పీఎస్ఎస్ తీసుకురావాలి

  • క్రూడ్‌ పామాయిల్‌ దిగుమతి సుంకాన్ని తగ్గించొద్దు

  • ఢిల్లీలో నిర్వహించిన రబీ సదస్సులో మంత్రి తుమ్మల

  • పామాయిల్‌పై కమిటీ వేస్తామన్న కేంద్ర మంత్రి శివరాజ్‌

న్యూఢిల్లీ, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): పప్పుధాన్యాల సాగులో 36శాతం వృద్ధి రేటుతో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో నిలిచిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యతకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లేలా రైతులను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. కొడంగల్‌లో అగ్రి బిజినెస్‌ పార్క్‌, సెమీ అరిడ్‌ హార్టికల్చర్‌ క్రాప్స్‌ కోసం సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటు కోసం ఇప్పటికే డీపీఆర్‌లను సమర్పించామని గుర్తు చేశారు. ఈ రెండు ప్రాజెక్టులకు సహకారం అందించాలని కోరారు. ఢిల్లీలో మంగళవారం జరిగిన జాతీయ రబీ సదస్సుకు తుమ్మల హాజరయ్యారు. పంటల వైవిధ్యీకరణ, వాతావరణ మార్పులు, డిజిటల్‌ వ్యవసాయం, మౌలిక వసతులు, రుణ సదుపాయాలకు సంబంధించి తెలంగాణలో అమలు చేస్తున్న చర్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో పంటల వైవిద్యీకరణకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. మొక్కజొన్న, జొన్నను ధరల మద్దతు పథకం (పీఎస్ఎస్‌) పరిధిలోకి తీసుకురావాలని కోరారు. లోటు వర్షపాతం నమోదైన మండలాలను గుర్తించి, ప్రత్యేక సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. సూక్ష్మ సాగు నీరు, రక్షిత సాగు నీరు, నీటి సంరక్షణ నిర్మాణాలకు ప్రత్యేక సహకారం అందించాలని కోరారు.


తెలంగాణలో 33 జిల్లాలు ఉండగా... ప్రస్తుతం 16 కృషి విజ్ఞాన కేంద్రాలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. మరో 16 కృషి విజ్ఞాన కేంద్రాలను మంజూరు చేయాలని కోరారు. తెలంగాణలో అదనంగా 1.10 లక్షల హెక్టార్లలో ఆయిల్‌పామ్‌ సాగు విస్తరించిందని, 72వేల మంది కొత్త రైతులు ఆయిల్‌పామ్‌ సాగులోకి వచ్చారని వివరించారు. ఆయిల్‌పామ్‌ రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని క్రూడ్‌ పామాయిల్‌ దిగుమతి సుంకాన్ని తగ్గించడం సరికాదని, గతంలో ఉన్న 44 శాతం సుంకాన్ని పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌.. ఆయిల్‌పామ్‌ ధరలపై ప్రత్యేక కమిటీని నియమించి.. రైతుల సమస్యలను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. కాగా, తెలంగాణలో మట్టి ఆరోగ్య పరీక్షల లక్ష్యాన్ని 2 లక్షల నమూనాలకు పెంచాలని మంత్రి కోరారు. శాస్త్రీయ మట్టి పరీక్షల ద్వారా సమతుల్య ఎరువుల వినియోగం, సాగు ఖర్చుల తగ్గింపు, ఉత్పాదకత పెంపునకు అవకాశం ఉంటుందని తెలిపారు.

Updated Date - Sep 30 , 2026 | 05:45 AM