Share News

Tumidihatti Project: తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు పనుల్లో కదలిక

ABN , Publish Date - Jan 15 , 2026 | 05:38 AM

ఉమ్మడి ఆదిలాబాద్‌లోని మంచిర్యాల, ఆసిఫాబాద్‌ జిల్లాలకు సాగు నీరందించే ఉద్దేశంతో నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో నిర్మించదలిచిన డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సుజల స్రవంతి...

Tumidihatti Project: తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు పనుల్లో కదలిక

  • నెన్నెల నుంచి సుందిళ్ల వరకు అలైన్‌మెంట్‌ సర్వే షురూ

  • పూర్తికాగానే డీపీఆర్‌ తయారీకి ప్రణాళిక..

  • ప్రాజెక్టుతో ఉమ్మడి ఆదిలాబాద్‌ రైతాంగానికి ఎంతో ప్రయోజనం

మంచిర్యాల, జనవరి 14 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి ఆదిలాబాద్‌లోని మంచిర్యాల, ఆసిఫాబాద్‌ జిల్లాలకు సాగు నీరందించే ఉద్దేశంతో నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో నిర్మించదలిచిన డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సుజల స్రవంతి ప్రాణహిత-చేవెళ్ల ఎత్తిపోతల పథకం పనుల్లో ఎట్టకేలకు కదలిక వచ్చింది. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయంతో ప్రాజెక్టుకు పునరుజ్జీవం పోసినట్లయింది. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఇప్పటికే 30 కిలోమీటర్ల మేర కాలువలు తవ్వడానికి రూ.639 కోట్లు వెచ్చించారు. రేవంత్‌ సర్కారు తాజా నిర్ణయంతో ఇప్పటివరకు వెచ్చించిన మొత్తం తిరిగి ఉపయోగంలోకి రానుంది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా పరిధిలోని 2 లక్షల ఎకరాల పైచిలుకు ఆయకట్టుకు సాగు నీరందించే లక్ష్యంతో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు రూపకల్పన జరిగింది. 160 టీఎంసీల సామర్థ్యంతో 2008లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం పథకానికి శ్రీకారం చుట్టింది.


కాళేశ్వరంతో ఆగిన పనులు..

ప్రాజెక్టు పనులను 28 ప్యాకేజీలుగా విభజించి వివిధ కాంట్రాక్టింగ్‌ కంపెనీలకు అప్పగించారు. మంచిర్యాల జిల్లాలో ఐదు ప్యాకేజీల్లో 125 కిలోమీటర్ల మేర కాలువల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఒకటో ప్యాకేజీలో ఆసిఫాబాద్‌ జిల్లా కౌటాల మండలం రణవెల్లి నుంచి ప్రారంభమైన కాలువ నిర్మాణం బెజ్జూర్‌ మండలం కర్జెల్లి దాటింది. దహెగాం, నెన్నెల మండలంలో పనులు చేపట్టారు. నెన్నెల మండలం మైలారం వద్ద టన్నెల్‌ నిర్మాణ పనులు చేపట్టారు. 5 కిలోమీటర్ల మేర పైపులైన్‌ నిర్మాణ పనులు చేపట్టారు. 5 ప్యాకేజీల ద్వారా చేపట్టిన పనుల్లో భూములు కోల్పోయిన వారికి 75 శాతం వరకు పరిహారం కూడా అందజేశారు. అయితే బీఆర్‌ఎస్‌ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడంతో ప్రాణహిత ప్రాజెక్టు అర్ధాంతరంగా నిలిచిపోయింది. తుమ్మిడిహెట్టి నుంచి నెన్నెల మండలం మైలారం మీదుగా మొత్తం 71 కిలోమీటర్ల మేర కాలువలు నిర్మించాల్సి ఉండగా, అందులో 30 కిలోమీటర్ల మేర కాలువలు తవ్వి పనులను మధ్యలో వదిలేశారు. అయితే తాజాగా కాంగ్రెస్‌ సర్కారు నిర్ణయం మేరకు ప్రాజెక్టుకు పునరుజ్జీవం పోయనుండగా, నెన్నెల మండలం మైలారం నుంచి నేరుగా జైపూర్‌ మండలం సుందిళ్ల వద్ద గోదావరి వరకు నీళ్లు గ్రావిటీ ద్వారా కాలువల గుండా తరలించే అవకాశముంది. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు పనుల పునరుద్ధరణ కోసం ఇటీవల అధికారులు అలైన్‌మెంట్‌ సర్వే చేపట్టారు. ఆర్వీ కన్సల్టెన్సీ ఏజెన్సీ సర్వే పనులు చేపడుతుండగా ఆసిఫాబాద్‌ జిల్లా తుమ్మిడిహెట్టి నుంచి మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం మైలారం వరకు గతంలో నిర్మించిన ప్రధాన కాలువ, ఇతర నిర్మాణాలు, సొరంగ మార్గంలో పైపులైన్ల ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తున్నారు. మైలారం నుంచి 35 కిలోమీటర్ల దూరంలోని సుందిళ్ల బ్యారేజీ వరకు సర్వే చేపట్టి, గ్రావిటీ ద్వారా నీటిని తీసుకెళ్లేలా కాలువల డిజైన్‌ చేయనున్నారు. సర్వే పూర్తి చేసిన అనంతరం 3 నెలల్లోగా డీపీఆర్‌ రూపొందించి ప్రభుత్వానికి అందజేయనున్నారు.

Updated Date - Jan 15 , 2026 | 05:40 AM