Share News

ఎవరి పట్టువారిదే.. మిగిలింది 2 రోజులే

ABN , Publish Date - Apr 19 , 2026 | 06:28 AM

ఆర్టీసీ సమ్మె విషయంలో ఇటు కార్మిక సంఘాలు. అటు ప్రభుత్వం పట్టుదలగా న్నాయి. ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వంలో విలీనం చేయడం, వేతన సవరణ, ఇతర సమస్యల పరిష్కారం కోరుతూ ఏప్రిల్‌ 22 నుంచి సమ్మె చేపడతామని ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది.

ఎవరి పట్టువారిదే.. మిగిలింది 2 రోజులే

  • 22 నుంచి సమ్మెకు పిలుపునిచ్చిన ఆర్టీసీ జేఏసీ

  • పట్టువీడని ప్రభుత్వం, కార్మిక సంఘాలు

  • చర్చలకు తలుపులు తెరిచే ఉంటాయన్న మంత్రి

  • అధికారికంగా చర్చలకు ఆహ్వానించాలంటున్న జేఏసీ

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ సమ్మె విషయంలో ఇటు కార్మిక సంఘాలు. అటు ప్రభుత్వం పట్టుదలగా న్నాయి. ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వంలో విలీనం చేయడం, వేతన సవరణ, ఇతర సమస్యల పరిష్కారం కోరుతూ ఏప్రిల్‌ 22 నుంచి సమ్మె చేపడతామని ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. సమ్మెకు మరో రెండు రోజులే గడువు ఉంది. అయితే, రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారం చేపట్టిన తర్వాత గతేడాది కూడా ఆర్టీసీ జేఏసీ సమ్మెకు సిద్ధమైంది. కానీ ఒక్క రోజు ముందు మంత్రితో జరిగిన చర్చల నేపథ్యంలో సమ్మె నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. కానీ, ఈ సారి సమ్మె విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని, తమ సమస్యలను పరిష్కరించుకుంటామని జేఏసీ నాయకులు పేర్కొంటున్నారు. ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వంలో విలీనం, కార్మిక సంఘాల పునరుద్ధరణ మినహా ఇతర అంశాలపై చర్చించేందుకు తమ తలుపులు తెరిచే ఉంటాయని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రకటించారు. అయితే, ప్రభుత్వంతో చర్చలకు తమను అధికారికంగా ఆహ్వానించాలని జేఏసీ నాయకులు పట్టుబడుతున్నారు. ప్రభుత్వం, జేఏసీ నాయకులు ఎవరికి వారు పట్టుదలగా ఉండడంతో పరిస్థితి ఎలా ఉంటుందోనని ఉత్కంఠ నెలకొంది. కాగా, సమ్మెను విజయవంతం చేసేందుకు జేఏసీ, కార్మిక సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా డిపోల వద్ద గేట్‌ సమావేశాలు, సమ్మె కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. ఆరు ప్రధాన కార్మిక సంఘాల మద్దతుతో జేఏసీ సమ్మెకు పిలుపునిచ్చింది. తాజాగా స్టాప్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌(ఎస్‌డబ్ల్యూఎఫ్) కూడా సమ్మెకు మద్దతు తెలిపింది.


మంత్రితో కార్మిక నాయకుల రహస్య భేటీ

ఆర్టీసీ జేఏసీ సమ్మెకు పిలుపునివ్వగా జేఏసీలో లేని కొన్ని కార్మిక సంఘాల నాయకులు మంత్రి పొన్నం ప్రభాకర్‌తో శుక్రవారం రాత్రి రహస్యంగా సమావేశమైనట్టు తెలిసింది. సమ్మె, ప్రస్తుత పరిస్థితులు, ప్రభావాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. అయితే జేఏసీలో లేని కార్మిక సంఘాల నాయకులు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఇలా రహస్య మంతనాలు జరపడం తగదని జేఏసీ ఛైర్మన్‌ ఈదువు వెంకన్న అన్నారు.

Updated Date - Apr 19 , 2026 | 06:28 AM