ఆర్టీసీ కార్మికుల ప్రయోజనాలు కాపాడేందుకే..ముందుగా గుర్తింపు సంఘాల ఎన్నికలు
ABN , Publish Date - Jun 28 , 2026 | 03:29 AM
టీఎస్ఆర్టీసీ కార్మికుల ప్రయోజనాలు కాపాడేందుకే ముందుగా గుర్తింపు సంఘాల ఎన్నికలు నిర్వహిస్తున్నామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
కొందరు కార్మిక నాయకుల తీరు సరికాదు: మంత్రి పొన్నం
హైదరాబాద్, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): టీఎస్ఆర్టీసీ కార్మికుల ప్రయోజనాలు కాపాడేందుకే ముందుగా గుర్తింపు సంఘాల ఎన్నికలు నిర్వహిస్తున్నామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆర్టీసీ కార్మికుల మొదటి డిమాం డ్ గుర్తింపు సంఘాలు ఎన్నికలు అని చెప్పిన సంఘాల నాయకుల్లో కొందరు ఇప్పుడు మాట మార్చి ప్రజలను, కార్మికులను పక్కదోవ పట్టించడం సరికాదన్నారు. సమ్మె విమరణ సమయంలో ఆర్టీసీ కార్మికులకు తాము ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. కానీ గుర్తింపు సంఘాల ఎన్నికల నిర్వహణ, ఆర్టీసీ ఉద్యోగుల విలీన ప్రక్రియను కొందరు కార్మిక నాయకులు వివాదాస్పదం చేయడం సరైంది కాదని మంత్రి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి సంబంధించి విధివిధానాలు రూపొందించే అధికారుల కమిటీలో కార్మిక సంఘాల ప్రతినిధులు తప్పనిసరిగా ఉండాలని కార్మికులు ఏకగ్రీవంగా నిర్ణయించారని పేర్కొన్నారు. అందుకే ముందుగా గుర్తింపు సంఘాల ఎన్నికలు నిర్వహించాలనే నిర్ణయం తీసుకున్నామని ఆయన వెల్లడించారు.