ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలకు అండ: ఎండీ
ABN , Publish Date - May 27 , 2026 | 05:05 AM
విపత్కర పరిస్థితుల్లో ఉద్యోగుల కుటుంబాలకు ఆర్టీసీ అండగా నిలుస్తుందని సంస్థ ఎండీ వై. నాగిరెడ్డి భరోసా ఇచ్చారు. పికెట్, పరిగి డిపోలకు చెందిన...
హైదరాబాద్, మే 26 (ఆంధ్రజ్యోతి): విపత్కర పరిస్థితుల్లో ఉద్యోగుల కుటుంబాలకు ఆర్టీసీ అండగా నిలుస్తుందని సంస్థ ఎండీ వై. నాగిరెడ్డి భరోసా ఇచ్చారు. పికెట్, పరిగి డిపోలకు చెందిన ఆర్టీసీ డ్రైవర్లు సుధాకర్, శ్రీనివాసరెడ్డి వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందారు. యూనియన్ బ్యాంక్‌లో సూపర్ సాలరీ సేవింగ్ ఖాతా ఉన్న ఆర్టీసీ ఉద్యోగులకు బ్యాంకు ఉచితంగా కోటి రూపాయల ప్రమాద బీమా అందిస్తోంది. బస్‌భవన్‌లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో బ్యాంకు అధికా రులతో కలిసి ఇద్దరు డ్రైవర్ల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున బీమా చెక్కులను ఎండీ నాగిరెడ్డి అందించారు. కాగా, ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ నెల 9న ఆర్టీసీ కళాభవన్‌లో ‘ఆర్ట్ ఫర్ లైఫ్’ పేరుతో సందేశాత్మక కళా పోటీల్ని నిర్వహించగా.. పోటీల్లో గెలుపొందిన వారికి ఎండీ నాగిరెడ్డి బహుమతులు అందించారు.
వ్యాట్ నుంచి మినహాయించాలని కార్మికుల విజ్ఞప్తి
ఆర్టీసీ బస్సులకు ఉపయోగించే డీజిల్‌ను వ్యాట్ నుంచి రెండేళ్ల పాటు మినహాయింపు ఇవ్వాలని కార్మికులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. డీజిల్ ధరల పెరుగుదలతో ఆర్టీసీపై ఏటా సుమారు రూ.200 కోట్ల ఆర్థిక భారం పడుతుందని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో ఆర్టీసీకి ఊరట కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఆర్టీసీ బోర్డు మాజీ డైరెక్టర్ ఎం. నాగేశ్వర్ రావు ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.
2021 వేతన సవరణతో కార్మికులకు అన్యాయం: ఈయూ
2021 వేతన సవరణపై ఆర్టీసీ యాజమాన్యం ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులతో కార్మికవర్గానికి అన్యాయం జరిగిందని తెలంగాణ ఆర్టీసి ఎంప్లాయీస్ యూనియన్ ఆరోపించింది. 2021 వేతన సవరణకు సంబం ధించి ఐదేళ్ల వేతన బకాయిల గురించి ఆ ఉత్తర్వులలో లేకపోవడం అన్యాయం జరిగినట్లుగా భావిస్తున్నామని యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్. బాబు వెల్లడించారు. 2021 నుంచి పదవీ విరమణ పొందిన ఉద్యోగుల బకాయిలపై ఆ ఉత్తర్వుల్లో ఎక్కడ ప్రస్థావించలేదన్నారు.