Share News

Special Buses: టీఎస్‌ఆర్‌టీసీకి పండగ

ABN , Publish Date - Jan 13 , 2026 | 07:21 AM

సంక్రాంతి పండుగ వచ్చిందంటే హైదరాబాద్‌ నగరం సగం ఖాళీ అవుతుంది. ఇక్కడ నివాసముండే ఆంధ్రప్రదేశ్‌ చెందినవారంతా పండుగకు ఏపీ బాట పట్టడం...

Special Buses: టీఎస్‌ఆర్‌టీసీకి పండగ

  • ప్రత్యేక బస్సులను తగ్గించిన ఏపీఎస్‌ ఆర్టీసీ

  • గతేడాది తెలంగాణ నుంచి 2వేల బస్సులు నడిపిన ఏపీ

  • ఈసారి పండుగకు కేవలం 200 బస్సులకే పరిమితం

  • పండుగకు 6,431 ప్రత్యేక బస్సులు నడపతున్న టీజీఎస్ఆర్టీసీ..

హైదరాబాద్‌, జనవరి 12(ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండుగ వచ్చిందంటే హైదరాబాద్‌ నగరం సగం ఖాళీ అవుతుంది. ఇక్కడ నివాసముండే ఆంధ్రప్రదేశ్‌ చెందినవారంతా పండుగకు ఏపీ బాట పట్టడం, తెలంగాణకు చెందినవారూ సొంతూళ్లకు వెళ్లడమే ఇందుకు కారణం. దీనికి అనుగుణంగా రెండు రాష్ట్రాల రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)లు ప్రతిసారీ పెద్ద సంఖ్యలో స్పెషల్‌ బస్సులను నడుపుతుంటాయి. అయితే ఈసారి సంక్రాంతికి ఏపీఎస్‌ ఆర్టీసీ స్పెషల్‌ బస్సుల సంఖ్యను తగ్గించింది. దీంతో తెలంగాణ ఆర్టీసీపై అదనపు బస్సుల భారం పడింది. అదే సమయంలో సంస్థకు అదనపు ఆదాయం కూడా సమకూరుతోంది. తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ మహాలక్ష్మి పథకం పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించినట్లే.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా ఆ రాష్ట్రంలో ‘స్త్రీ శక్తి’ పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తోంది. దీంతో ఏపీ వ్యాప్తంగా సంక్రాంతికి బస్సుల్లో మహిళా ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండనుంది. దీంతో వారికి తగినన్ని బస్సులను అందుబాటులో ఉంచేందుకుగాను.. ఈసారి తెలంగాణ నుంచి ఏపీకి నడిపే ప్రత్యేక బస్సుల్ని ఏపీఎ్‌సఆర్టీసీ తగ్గించింది. గత సంక్రాంతికి తెలంగాణ నుంచి 2వేల స్పెషల్‌ సర్వీసులను నడిపిన ఆ సంస్థ.. ఈసారి కేవలం 200 స్పెషల్‌ బస్సులకు మాత్రమే పరిమితమైంది.


దీంతో ఏపీకి వెళ్లే ప్రయాణికుల కోసం తెలంగాణ ఆర్టీసీ స్పెషల్‌ బస్సుల సంఖ్యను పెం చింది. సంక్రాంతి పండుగకు మొత్తం 6,431 ప్రత్యేక బస్సులను టీజీఎ్‌సఆర్టీసీ యాజమాన్యం నడుపుతోంది. పండుగ ముందు రోజుల్లోనూ, అలాగే జనవరి 18, 19 తేదీల్లో తిరుగు ప్రయాణ రద్దీకి సంబంధించి తగిన ఏర్పాట్లు చేసింది. స్పెషల్‌ బస్సులకు 1.5శాతం మేర సవరించిన చార్జీలు వర్తిస్తాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ప్రత్యేక బస్సులకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఆర్టీసీ కాల్‌ సెంటర్‌ నంబర్లు 040-69440000, 040-23450033లలో సంప్రదించాలని సూచించారు.

టికెట్‌ ధరలు పెంచేసిన ప్రైవేటు ట్రావెల్స్‌..

ప్రయాణికుల నుంచి ప్రైవేటు ట్రావెల్స్‌.. చార్జీల పేరుతో పెద్ద మొత్తంలో దండుకుంటున్నాయి. హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నంకు తెలంగాణ ఆర్టీసీ లహరి ఏసీ బస్సుల్లో టికెట్‌ ధర రూ.1500 వరకు ఉండగా, ప్రైవేటు బస్సుల్లో రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు వసూలు చేస్తున్నారు. ప్రైవేట్‌ ట్రావెల్స్‌పై చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. అధికంగా వసూలు చేసే ట్రావెల్స్‌పై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు.

Updated Date - Jan 13 , 2026 | 07:21 AM