డిమాండ్ లేని సమయంలో యూనిట్‌కు 50 పైసలు రాయితీ!
ABN , Publish Date - Apr 01 , 2026 | 04:32 AM
రాష్ట్రంలో హెచ్‌టీ, వాణిజ్య వర్గాల వారికి డిమాండ్ లేని సమయంలో విద్యుత్తు వినియోగానికి ఇస్తున్న రాయితీలను ఎత్తివేయాలని డిస్కమ్‌లు ‘తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి.....
పీక్ సమయంలో విద్యుత్తు వాడకానికి రూ.1.50 అదనపు చార్జీ
హెచ్‌టీ, వాణిజ్య వర్గాలకు రాయితీ పునరుద్ధరణ
రాయితీలు ఎత్తేయాలని డిస్కమ్‌ల ప్రతిపాదన
పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకున్న ఈఆర్‌సీ
హైదరాబాద్, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో హెచ్‌టీ, వాణిజ్య వర్గాల వారికి డిమాండ్ లేని సమయంలో విద్యుత్తు వినియోగానికి ఇస్తున్న రాయితీలను ఎత్తివేయాలని డిస్కమ్‌లు ‘తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి (టీజీఈఆర్‌సీ)’కి ప్రతిపాదించాయి. అయితే, డిమాండ్ లేని సమయంలో ప్రధానంగా సౌర విద్యుత్తు అందుబాటులోకి వచ్చినప్పుడు ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల దాకా కరెంటును వినియోగిస్తే యూనిట్‌కు 50పైసల రాయితీ ఇస్తూ ఈఆర్‌సీ నిర్ణయం తీసుకుంది. గతంలో ఈ రాయితీ రూ.1 ఉండగా.. కొన్ని నెలల కింద డిస్కమ్‌లు దాన్ని నిలిపివేశాయి. తాజా ఆర్థిక సంవత్సరం పిటిషన్లపై విచారణ సందర్భంగా పారిశ్రామిక వర్గాలు గణాంకాలతో సహా వివరించడంతో ఈఆర్‌సీ టైమ్ ఆఫ్ డే (టీవోడీ- డిమాండ్ లేని సమయంలో రాయితీ, డిమాండ్ ఉన్న సమయంలో అదనపు చార్జీల వసూలు) రాయితీని పునరుద్ధరించింది. గతంలో రూ.1గా ఉన్న రాయితీని 50 పైసలు చేసింది. అలాగే డిమాండ్ అధికంగా(పీక్) ఉన్న సమయంలో ఉదయం 6 నుంచి 10 గంటల మధ్య, మళ్లీ సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల మధ్య విద్యుత్తు వినియోగానికి అదనంగా రూ.1.50 చార్జీ విధించింది. గతంలో ఇది రూ.1గా ఉండేది. ఇక రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల దాకా (ఈఆర్‌సీ ఖరారు చేసిన) సాధారణ చార్జీలను వర్తింపజేయనున్నారు. ఇవి హెచ్‌టీ, వాణిజ్య వర్గాల వారికి అమలు కానున్నాయి. మరోవైపు 2026-27 ఆర్థిక సంవత్సరానికిగాను డిస్కమ్‌లు రూ.72,996 కోట్ల వార్షిక ఆదాయ అవసరాలు (ఏఆర్‌ఆర్) ఉన్నట్లు ప్రతిపాదనలు సమర్పించగా.. అభ్యంతరాల స్వీకరణ, బహిరంగ విచారణ అనంతరం ఈఆర్‌సీ ఆ మొత్తాన్ని రూ.64,950కోట్లకు కుదించింది. ఇదిలాఉండగా.. ఏ విభాగంలోనూ విద్యుత్తు చార్జీలను పెంచలేదు. అంటే 2026-27లోనూ పాత చార్జీలే అమలు కానున్నాయి. ఈ మేరకు 2026-27కు గాను ఈఆర్‌సీ టారిఫ్ ఉత్తర్వులను విడుదల చేసింది. రెవెన్యూ లోటును రూ.22,104కోట్లుగా చూపించగా.. రూ.14,059కోట్లకు కుదించింది. హెచ్‌టీ వినియోగదారులు, అందులోనూ క్యాప్టివ్ ప్లాంట్లకు (సొంత వినియోగానికి కట్టుకున్న పవర్ ప్లాంట్లు గ్రిడ్‌కు అనుసంధానమైతే) గ్రిడ్ సపోర్ట్ చార్జీల కింద ప్రతి కిలోవాట్‌కు రూ.19.77గా ఖరారు చేశారు.
రాయితీ పునరుద్ధరణ..
ఉదయం 6 నుంచి 10 గంటల దాకా బహిరంగ విపణిలో యూనిట్ విద్యుత్తు రూ.10కి అమ్ముడుపోతుండగా.. ఉదయం 9:45గంటల తర్వాత ధర క్రమంగా పడిపోతుండేది. దీంతో సౌరవిద్యుత్తు అందుబాటులోకి వచ్చే క్రమంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల మధ్య విద్యుత్తు వినియోగానికి యూనిట్‌కు 50 పైసలు రాయితీ కల్పించారు. గతంలో రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల దాకా కరెంట్ వాడితే యూనిట్‌కు రూ.1.50రాయితీ ఉండగా.. తాజాగా ఈ సమయంలో సాధారణ చార్జీలను వసూలు చేయనున్నారు. ఉదయం 6 నుంచి 10 గంటల దాకా, మళ్లీ సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల దాకా కరెంట్ వినియోగిస్తే గతంలో యూనిట్‌కు రూ.1 అదనపు చార్జీ ఉండగా, దాన్ని రూ.1.50కు ఈఆర్‌సీ పెంచింది. అంటే, గతంలో రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల దాకా ఇచ్చిన రాయితీలో ప్రస్తుతం మార్పులు చేసి, ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల మధ్య కరెంటు వినియోగానికి వర్తింపజేసింది.