సంఘాలు వద్దు... ఉద్యోగుల విలీనమే
ABN , Publish Date - May 03 , 2026 | 05:05 AM
ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం వైపే కార్మిక సంఘాల నాయకులు మొగ్గు చూపుతున్నారు. ఆర్టీసీలో గుర్తింపు సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలా..
స్పష్టం చేసిన ఆర్టీసీ కార్మిక సంఘాలు
సంస్థ ఎండీ నాగిరెడ్డికి లేఖలు
హైదరాబాద్, మే 2 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం వైపే కార్మిక సంఘాల నాయకులు మొగ్గు చూపుతున్నారు. ఆర్టీసీలో గుర్తింపు సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలా? ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలా? అనే విషయంలో కార్మిక సంఘాల నాయకులు చర్చించుకుని ఏకాభిప్రాయానికి రావాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. యూనియన్ నాయకులు సీఎంను ఆయన నివాసంలో శుక్రవారం కలిసిన సందర్భంగా ఈ అంశం చర్చకు వచ్చింది. యూనియన్ ఎన్నికలు, ఉద్యోగుల విలీనంపై కార్మికులు, కార్మిక సంఘాలదే తుది నిర్ణయమని సీఎం స్పష్టం చేసారు. దీంతో యూనియన్ ఎన్నికలు వద్దని, ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని కొన్ని సంఘాల నాయకులు సీఎంకు వివరించారు. ఇదే అంశానికి సంబంధించి ఆర్టీసీ ఎండీ వై. నాగిరెడ్డికి సంఘాల నాయకులు శనివారం తమ యూనియన్ అభిప్రాయానికి సంబంధించిన లేఖలు అందజేసారు. తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంత్ ముదిరాజ్ ఆర్టీసీ ఎండీని కలిసి ఈ మేరకు లేఖ అందించారు. యూనియన్ల ఎన్నికలు వద్దని, ఉద్యోగులను విలీనం చేయాలని తమ యూనియన్ తీర్మానించిందని ఎండీకి వివరించారు. ఉద్యోగుల విలీనంపై జూన్ 2న ప్రభుత్వం ప్రకటన చేయాలని కోరారు. ఇదే అంశానికి సంబంధించి మరికొన్ని యూనియన్లు శనివారం సమావేశమై చర్చించుకున్నాయి. ఒకటి, రెండు రోజుల్లో ఆర్టీసీ యాజమాన్యానికి తమ అభిప్రాయాలపై లేఖలు సమర్పించనున్నాయి.