జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డులు ఎందుకు రెన్యువల్ చేయలేదు?: హైకోర్టు
ABN , Publish Date - May 22 , 2026 | 04:45 AM
అక్రిడిటేషన్ కార్డుల సమస్య కేవలం పిటిషనర్‌లది మాత్రమే కాదని, ఇది మొత్తం జర్నలిస్టుల సమాజానికి సంబంధించిన సమస్య అని హైకోర్టు పేర్కొంది.
హైదరాబాద్, మే 21 (ఆంధ్రజ్యోతి): అక్రిడిటేషన్ కార్డుల సమస్య కేవలం పిటిషనర్‌లది మాత్రమే కాదని, ఇది మొత్తం జర్నలిస్టుల సమాజానికి సంబంధించిన సమస్య అని హైకోర్టు పేర్కొంది. వాటిని రెన్యువల్ చేసి, కొత్తవి జారీ చేయడంలో ఆలస్యం ఎందుకు జరుగుతోందని ప్రశ్నించింది. కార్డులను నవీకరించకపోవడంతోపాటు, అక్రిడిటేషన్ రూల్స్ మారుస్తూ ప్రభుత్వం జారీచేసిన జీవో 252ను సవాల్ చేస్తూ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ సహా పలు సంఘాలు పిటిషన్‌లు దాఖలు చేశాయి. ఇవి గురువారం వెకేషన్ కోర్టులో విచారణకు వచ్చాయి. ప్రభుత్వ న్యాయవాది వాదిస్తూ.. ఇప్పటికే ఉన్న గుర్తింపు కార్డుల గడువును జూన్ 16 వరకు పొడిగిస్తామని తెలిపారు. రెన్యువల్ చేయకుండా గతంలో మే 31 వరకు కార్డుల గడువు పొడిగించారని, ఇప్పుడు మళ్లీ జూన్ 16 వరకు పొడిగిస్తామని చెప్పడమేమిటని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ప్రభుత్వం ఇచ్చిన హామీని మన్నించి తదుపరి విచారణను జూన్ 16కు వాయిదా వేసింది.