Share News

కావాలనే తాకట్టు భూమిలో సమాధుల నిర్మాణం

ABN , Publish Date - Jun 20 , 2026 | 04:15 AM

రుణం ఇచ్చేందుకు తాము తాకట్టు పెట్టుకున్న భూమిలో సమాధులు ఉన్నాయని, వాటిని తొలగించేలా జీహెచ్‌ఎంసీకి ఆదేశాలు జారీచేయాలని..

కావాలనే తాకట్టు భూమిలో సమాధుల నిర్మాణం

  • వాటిని తొలగించేలా ఆదేశించండి

  • హైకోర్టును ఆశ్రయించిన ఐడీబీఐ బ్యాంకు

  • మరణించేవారికీ హక్కులు ఉంటాయి కదా!: ధర్మాసనం

హైదరాబాద్‌, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): రుణం ఇచ్చేందుకు తాము తాకట్టు పెట్టుకున్న భూమిలో సమాధులు ఉన్నాయని, వాటిని తొలగించేలా జీహెచ్‌ఎంసీకి ఆదేశాలు జారీచేయాలని కోరుతూ ఐడీబీఐ బ్యాంకు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై శుక్రవారం జస్టిస్‌ బీ విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. బ్యాంకు తరఫు న్యాయవాది వాదిస్తూ.. మెలాంజ్‌ క్లోతింగ్‌ అనే కంపెనీకి రుణం ఇచ్చినట్టు తెలిపారు. బడంగ్‌పేట్‌ సమీపంలోని నాదర్‌గుల్‌లో 2100 చదరపు గజాల స్థలాన్ని రుణం కోసం తాకట్టు పెట్టిందని పేర్కొన్నారు. రుణం చెల్లింపులో కంపెనీ యాజమాన్యం విఫలం కావడంతో ఆ ఆస్తి స్వాధీనానికి వెళ్లగా అక్కడ సమాధులు ఉన్నట్లు తెలిపారు. రుణగ్రహీతలే స్థానికులతో కుమ్మక్కై మృతదేహాలను అక్కడ సమాధి చేయించారని ఆరోపించారు. మతపరమైన సెంటిమెంట్‌ను సృష్టించడం ద్వారా ఆ స్థలాన్ని పొజిషన్‌లోకి తీసుకోకుండా కుట్ర చేశారని పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. సమాధులు తరలించాలని హైకోర్టు ఎలా ఆదేశాలు జారీచేయగలదంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. బతికి ఉన్న వారితో సమానంగా చనిపోయిన వారికి కూడా హక్కులు ఉంటాయని తెలిపింది. కొన్ని సందర్భాల్లో సెంటిమెంట్‌ను కూడా గౌరవించాల్సి వస్తుందని వ్యాఖ్యానించింది. దీనిపై జీహెచ్‌ఎంసీ, పోలీసుల వివరణ తెలియజేయాలని పేర్కొంటూ విచారణను జూలై 1కి వాయిదా వేసింది.

Updated Date - Jun 20 , 2026 | 04:15 AM