జీహెచ్‌ఎంసీ విభజనకు ప్రాతిపదిక ఏమిటి?
ABN , Publish Date - Feb 20 , 2026 | 01:36 AM
జీహెచ్‌ఎంసీని విభజించి మూడు ప్రత్యేక మున్సిపల్ కార్పొరేషన్‌లను ఏర్పాటు చేయడం వెనక ఉన్న చట్టబద్ధత ఏమిటో వివరించాలని...
కేంద్ర, రాష్ట్రాలకు హైకోర్టు నోటీసులు
హైదరాబాద్, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): జీహెచ్‌ఎంసీని విభజించి మూడు ప్రత్యేక మున్సిపల్ కార్పొరేషన్‌లను ఏర్పాటు చేయడం వెనక ఉన్న చట్టబద్ధత ఏమిటో వివరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు గురువారం హైకోర్టు నోటీసులు జారీచేసింది. మూడు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశాలిచ్చింది. 2027లో జనాభా లెక్కల ప్రక్రియ ముగిసే వరకు ఎలాంటి పునర్విభజనలు చేపట్టరాదని భారత రిజిస్ట్రార్ జనరల్, జనాభా లెక్కల కమిషనర్ గతేడాది ఆగస్టులో జారీ చేసిన సర్క్యులర్‌కు విరుద్ధంగా జీహెచ్‌ఎంసీ విభజన జరిగిందని పేర్కొంటూ దారం గురువారెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదనలు విన్న ధర్మాసనం.. నోటీసులు జారీ చేసి తదుపరి విచారణను మార్చి 25కి వాయిదా వేసింది.