ఆ పోస్టా.. బాబోయ్!
ABN , Publish Date - Apr 19 , 2026 | 06:16 AM
రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్) కార్యదర్శి పోస్టు ప్రస్తుతం ఐఏఎస్ అధికారులను హడలెత్తిస్తోంది.
సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ కార్యదర్శి పోస్టులో పది రోజులు ఉండలేకపోతున్న ఐఏఎస్‌లు
ఈనెల 15తో సెలవు ముగిసినా విధుల్లో చేరని విజయేందిర బోయి.. సెలవు పొడిగింపునకు యత్నం!
గడువు ముగిసిందని వెళ్లిపోయిన ఇన్‌చార్జి సెక్రెటరీ
కార్యదర్శి సీటు ఖాళీ.. సెంట్రలైజ్డ్ టెండర్‌పై ప్రభావం
హైదరాబాద్, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్) కార్యదర్శి పోస్టు ప్రస్తుతం ఐఏఎస్ అధికారులను హడలెత్తిస్తోంది. దళితులు, అట్టడుగు వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాల్సిన ఈ సంస్థలో ఏ అధికారి కూడా పట్టుమని పది రోజులు పనిచేయడం లేదు. సాధారణంగా ఏదైనా ఐఏఎస్ స్థాయి పోస్టుల్లో కనీసం రెండు, మూడేళ్లు కొనసాగిస్తుంటారు. కానీ ఇక్కడ మాత్రం 30 మంది ఐఏఎస్ అధికారులు కేవలం ఏడాదిలోపే బదిలీ అయ్యారు. ఇంకా చిత్రమేంటంటే.. ఒక అధికారి 4 రోజులు.. మరొకరు 10 రోజులు, ఇంకొకరు 14 రోజులు మాత్రమే ఉండి వెళ్లిపోయారు. నెల రోజుల్లోపే వెళ్లినవారూ ఎక్కువమందే ఉన్నారు. ఒకే అధికారిని పదే పదే నియమించి మళ్లీ కొద్ది రోజులకే బదిలీ చేయడం, లేదంటే సెలవుపై వెళ్లిపోవడం పరిపాటిగా మారిపోయింది. ఇప్పుడు అంతకన్నా చిత్రమైన పరిస్థితి నెలకొంది. అధికారులెవరూ లేక ఆ పోస్టు సీటు ఖాళీగా ఉండిపోయింది. 1986లో ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటైన ఈ సొసైటీ కార్యదర్శిగా 58 మంది అధికారులు మారగా.. అందులో 30 మందికిపైగా ఏడాదిలోపే బదిలీ అయ్యారు. ప్రభుత్వం వారిని తక్కువ కాలంలోనే మార్చేయడం, లేదా అధికారులు సెలవుపై వెళ్లడంతో ఈ పరిస్థితి నెలకొంది.
సొసైటీ బాధ్యతలు ఎవరికి?
ఈ ఏడాది ఫిబ్రవరి 28న గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శిగా నియమితులైన విజయేందిర బోయి.. వారం గడవక ముందే సెలవుపై వెళ్లారు. ఈ పోస్టులో కొనసాగడానికి ఆసక్తి లేదని ఆమె సన్నిహితుల వద్ద చెప్పినట్లు తెలిసింది. ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్యకు అదనపు బాధ్యతలు (ఎఫ్‌ఏసీ) అప్పగించినా వారం తర్వాత ఆయన కూడా సెలవుపై వెళ్లారు. తొలుత ఈ నెల ఒకటో తేదీ వరకు సెలవు పెట్టిన విజయేందిర బోయి.. ఆ సెలవును మరో 15 రోజులు పొడిగించుకున్నారు. ఈ క్రమంలో గిరిజన గురుకుల కార్యదర్శి, ఎస్సీ వెల్ఫేర్ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న సీతాలక్ష్మికి సాంఘిక సంక్షేమ గురుకుల కార్యదర్శిగా ఈ నెల మొదటి వారంలో అదనపు బాధ్యత అప్పగించాల్సి వచ్చింది. మరోవైపు విజయేందిరబోయి సెలవును మరింత పొడిగించుకునే ప్రయత్నాల్లో విధుల్లో చేరలేదు. సీతాలక్ష్మికి ఇచ్చిన గడువు ముగియడంతో ఈ నెల 15న ఆమె బాధ్యతలను వదిలేశారు. గురుకుల సొసైటీ సెక్రటరీ పోస్టు ఖాళీగా ఉండిపోయింది. దీనితో కీలకమైన కేంద్రీకృత టెండర్ల ప్రక్రియపై ఆందోళన మొదలైంది. ఇంతకుముందు లేనట్టుగా ప్రభుత్వం ఈసారి అన్ని గురుకుల సొసైటీలకు కలిపి కేంద్రీకృత టెండర్ విధానాన్ని తీసుకొచ్చింది. దీనికి సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ నోడల్ ఏజెన్సీగా ఉంది. ఆ టెండర్ల నిర్వహణకు ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ (పీఎంయూ)కు చైర్మన్‌గా వ్యవహరించాల్సిన కార్యదర్శి పోస్టు ఖాళీగా ఉండటంతో గందరగోళంగా మారింది. సొసైటీలో ఉన్నతాధికారులెవరూ స్థిరంగా లేకపోవడంతో.. ప్రధాన కార్యాలయంలో సిబ్బంది, అధికారులపై అజమాయిషీ ఉండటం లేదని.. ఫైళ్లు పెండింగ్‌లో పడుతున్నాయని చెబుతున్నారు.