ఇంజనీరింగ్‌లో సీట్ల భర్తీ 80శాతమే!
ABN , Publish Date - Aug 05 , 2026 | 06:11 AM
రాష్ట్రంలోని ప్రభుత్వ యూనివర్సిటీలు, ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో 80ు సీట్లు భర్తీ అయ్యాయి. ఇంకా 19,102 సీట్లు (సుమారు 20శాతం) మిగిలిపోయాయి.
ఖాళీగా మిగిలిపోయిన 19,102 సీట్లు
ప్రైవేటు వర్సిటీల్లో 99శాతం, కాలేజీల్లో 80శాతం భర్తీ
ప్రభుత్వ వర్సిటీల పరిధిలో నిండిన సీట్లు 69శాతమే..
కోస్గి ప్రభుత్వ కాలేజీలోని 214 సీట్లలో 45 సీట్లే భర్తీ
ఎప్‌సెట్ తుదివిడత సీట్ల కేటాయింపును వెల్లడించిన సాంకేతిక విద్యాశాఖ
హైదరాబాద్ సిటీ, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రభుత్వ యూనివర్సిటీలు, ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో 80ు సీట్లు భర్తీ అయ్యాయి. ఇంకా 19,102 సీట్లు (సుమారు 20శాతం) మిగిలిపోయాయి. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ మంగళవారం రాత్రి ఎప్‌సెట్ ఇంజనీరింగ్ తుదివిడత కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపు వివరాలను విడుదల చేసింది. రాష్ట్రంలో వివిధ ఇంజనీరింగ్ కోర్సుల్లో కలిపి మొత్తం 94,156 సీట్లు అందుబాటులో ఉండగా.. అందులో 75,054 సీట్లు (80శాతం) భర్తీ అయ్యాయి. తుదివిడతలో ఆప్షన్లు పెట్టుకున్న 35,096 మంది అభ్యర్థుల్లో.. కొత్తగా 3,281 మందికి సీట్లు లభించాయి. రాష్ట్రంలోని ఏకైక ప్రభుత్వ (కోస్గి) ఇంజనీరింగ్ కాలేజీలోని 214 సీట్లకుగాను 45 సీట్లే (21శాతమే) భర్తీ అయ్యాయి. రెండు ప్రైవేటు యూనివర్సిటీల్లో 99శాతం ఇంజనీరింగ్ సీట్లు భర్తీ అయ్యాయి. ప్రభుత్వ యూనివర్సిటీల్లో 69శాతం సీట్లు నిండగా, ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో 80శాతం సీట్లు భర్తీ అయ్యాయి. 5,771మంది అభ్యర్థులకు ఈడబ్ల్యూఎస్ కోటా కింద 10శాతం సీట్లు లభించాయి. తుదివిడతలో సీట్లు పొందిన అభ్యర్థులు.. ఈ నెల 7వ తేదీలోగా ఫీజు చెల్లించి, కాలేజీలో రిపోర్టు చేయాలని అధికారులు సూచించారు.
కంప్యూటర్ సైన్స్ వైపు అభ్యర్థుల మొగ్గు
ఎప్‌సెట్ కౌన్సెలింగ్‌లో అధికశాతం అభ్యర్థులు కంప్యూటర్ సైన్స్, సంబంధిత కోర్సుల వైపే మొగ్గు చూపారు. సీఎస్ఈలో 84శాతం, సీఎస్ఈ ఏఐఎంఎల్ 86శాతం, సీఎస్ఈ సైబర్ సెక్యూరిటీ 92శాతం, సీఎస్ఈ బిజినెస్ సిస్టమ్స్ సీట్లు 86శాతం భర్తీ అయ్యాయి. ఇక తక్కువ సంఖ్యలో ఉన్న సీఆర్‌సీ, సీఐటీ, బయోమెడికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలిమాటిక్స్, వీఎల్‌ఎస్ఐ డిజైన్, ఇన్‌స్ట్రుమెంటేషన్, మెటలర్జికల్ ఇంజనీరింగ్, మెకట్రానిక్స్, ఆటోమొబైల్ వంటి కోర్సుల్లో 100శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఈసీఈ సీట్లలో 79శాతం, ఈఈఈలో 65శాతం, మెకానికల్ ఇంజనీరింగ్‌లో 64శాతం, సివిల్ ఇంజనీరింగ్‌లో 69శాతం సీట్లు భర్తీ అయ్యాయి.