Share News

ఎప్‌సెట్‌కు 3,01,194 దరఖాస్తులు

ABN , Publish Date - Apr 23 , 2026 | 04:35 AM

ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ యూజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఉద్దేశించిన టీజీఎ్‌పసెట్‌కు దరఖాస్తుల స్వీకరణ ముగిసింది. మొత్తం 3,01,194 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా..

ఎప్‌సెట్‌కు 3,01,194 దరఖాస్తులు

  • ఇంజనీరింగ్‌కు 2.10లక్షలు.. అగ్రికల్చర్‌, ఫార్మసీకి 90 వేలకుపైగా

  • గతేడాది కంటే తగ్గిన దరఖాస్తుల సంఖ్య

  • నేటి నుంచి హాల్‌ టికెట్లు.. మే లో పరీక్షలు

హైదరాబాద్‌, హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ యూజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఉద్దేశించిన టీజీఎ్‌పసెట్‌కు దరఖాస్తుల స్వీకరణ ముగిసింది. మొత్తం 3,01,194 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. వీరిలో ఇంజనీరింగ్‌కు 2,10,308 మంది, అగ్రికల్చర్‌, ఫార్మసీకి 90,569 మంది, రెండింటికీ 317 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్టు ఎప్‌సెట్‌ కన్వీనర్‌ కె.విజయకుమార్‌ రెడ్డి బుధవారం తెలిపారు. అగ్రికల్చర్‌, ఫార్మసీ పరీక్షలు మే 4, 5 తేదీల్లో, ఇంజనీరింగ్‌ పరీక్షలు మే 9, 10, 11 తేదీల్లో జరగనున్నాయి. ఆయా తేదీల్లో పరీక్షలు ప్రతి రోజూ ఉదయం సెషన్‌లో 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్‌లో 3గంటల నుంచి సాయంత్రం 6వరకు జరుగుతాయి. ఈ నెల 23వ తేదీ ఉదయం 11 గంటల నుంచి అగ్రికల్చర్‌, ఫార్మసీ అభ్యర్థులు, 27న మధ్యాహ్నం 3 గంటల నుంచి ఇంజనీరింగ్‌ అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఎప్‌సెట్‌కు దరఖాస్తు చేసిన వారిలో ఓపెన్‌ కేటగిరీ అభ్యర్థులు 63,624 మంది, బీసీ కేటగిరీలో 1,40,603 మంది, ఎస్సీ కేటగిరీలో 45,837 మంది, ఎస్టీ కేటగిరీలో 27,272 మంది అభ్యర్థులు ఉన్నారు. మొత్తం అభ్యర్థుల్లో అబ్బాయిలు 1,59,704 మంది, అమ్మాయిలు 1,41,490 మంది ఉన్నారు. ఇంజనీరింగ్‌కు అబ్బాయిలు అధికంగా దరఖాస్తు చేయగా, అగ్రికల్చర్‌, ఫార్మసీకి అమ్మాయిలు ఎక్కువగా దరఖాస్తు చేసుకున్నారు. కంప్యూటర్‌ ఆధారితంగా పరీక్షలు నిర్వహిస్తున్నందున అభ్యర్థులు పరీక్ష ముగియగానే తమకు ఎన్ని మార్కులు వచ్చాయో స్ర్కీన్‌పై కనిపించేలా ఈసారి వీలు కల్పించారు. గతేడాదితో పోల్చితే ఈసారి ఎప్‌సెట్‌కు దరఖాస్తులు తగ్గాయి. రాష్ట్ర విభజన తర్వాత పదేళ్ల వరకు ఏపీ అభ్యర్థులకు కూడా తెలంగాణలోని వివిధ కాలేజీల్లో ప్రవేశాలు లభించేవి. గత రెండేళ్లుగా ప్రవేశాలకు ప్రభుత్వం నో చెప్పడంతో ఈ ఏడాది ఏపీ నుంచి ఒక్కరూ దరఖాస్తు చేయలేదని తెలుస్తోంది. కాగా ఐటీ పరిశ్రమలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో రెండేళ్లుగా ఇంజనీరింగ్‌కు దరఖాస్తుల సంఖ్య తగ్గుతున్నట్టు తెలుస్తోంది.


అగ్రికల్చర్‌, ఫార్మసీకి ఈసారి దరఖాస్తులు పెరిగాయి. ఇక ఎప్‌సెట్‌ నిర్వహణకు మొత్తం 16 టెస్ట్‌ జోన్లను ఏర్పాటు చేసిన జేఎన్‌టీయూ అధికారులు.. అగ్రికల్చర్‌, ఫార్మసీ పరీక్షల కోసం 106, ఇంజనీరింగ్‌ కోసం 115 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని 4 టెస్ట్‌ జోన్లలో అగ్రికల్చర్‌కు 55, ఇంజనీరింగ్‌కు 60 పరీక్షా కేంద్రాలను కేటాయించారు. ఖమ్మం, కరీంనగర్‌, వరంగల్‌ జోన్‌లో 7 నుంచి 13 వరకు పరీక్షా కేంద్రాలున్నాయి. ఆదిలాబాద్‌ జోన్‌లో 1, మహబూబ్‌నగర్‌, సంగారెడ్డి, కొత్తగూడెం, సత్తుపల్లి, నల్గొండ జోన్లలో 2చొప్పున , సిద్దిపేటలో 3, నిజామాబాద్‌లో 4 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. అభ్యర్థుల్లో అత్యధికంగా హైదరాబాద్‌ నుంచి ఉన్నారు. అన్ని జిల్లాల నుంచి హైదరాబాద్‌కు రవాణా సదుపాయాలు ఉండడం, కోచింగ్‌ తీసుకుంటున్న వారు సులభంగా పరీక్ష కేంద్రాలకు వెళ్లేందుకు వెసులుబాటు ఉన్నందున ఎక్కువ మంది అభ్యర్థులు హైదరాబాద్‌లోని పరీక్ష కేంద్రాలను ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

Updated Date - Apr 23 , 2026 | 04:35 AM