ఇంజనీరింగ్‌లో కొత్తగా 4,347 సీట్లు
ABN , Publish Date - Jul 19 , 2026 | 06:16 AM
ఇంజనీరింగ్ కోర్సుల్లో రాష్ట్రంలో కొత్తగా మరిన్ని సీట్లు అందుబాటులోకి వచ్చాయి. కొత్తగా 60 ప్రైవేటు కళాశాలల్లో అదనంగా 6,200 సీట్లకు ప్రభుత్వం అనుమతినిచ్చింది.
ఎప్‌సెట్ రెండో విడత కన్వీనర్ కోటాలో అందుబాటులోకి
వెబ్ ఆప్షన్ల ఎంపికకు నేడే తుది గడువు
హైదరాబాద్, హైదరాబాద్ సిటీ, జూలై 18(ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్ కోర్సుల్లో రాష్ట్రంలో కొత్తగా మరిన్ని సీట్లు అందుబాటులోకి వచ్చాయి. కొత్తగా 60 ప్రైవేటు కళాశాలల్లో అదనంగా 6,200 సీట్లకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఇందులో కన్వీనర్ కోటాలో 4,347 సీట్లు ఉన్నాయి. ఈ సీట్లు ఎప్‌సెట్ రెండో విడత కౌన్సెలింగ్‌లో అందుబాటులోకి వచ్చాయి. ఇందులో సీఎస్ఈకి అనుబంధంగా ఉన్న ఏఐ, ఎంఎల్, డీఎస్ తదితర కోర్సులకు సంబంధించి 2,583 సీట్లు ఉన్నాయి. సివిల్, ఈసీఈ, ఈఈఈ, మెకానికల్ లాంటి కోర్ ఇంజనీరింగ్ కోర్సుల సీట్లు 1,764 ఉన్నాయి. మొదటి విడత కౌన్సెలింగ్‌లో సీట్ల కేటాయింపు పూర్తయిన అనంతరం 27,487 సీట్లు మిగిలాయి. కొత్తగా మంజూరైన 4,347 సీట్లతో కలిపి కన్వీనర్ కోటాలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్య 31,834కు పెరిగింది. ఎప్‌సెట్ రెండో విడత కౌన్సెలింగ్ వెబ్‌ఆప్షన్ల ప్రక్రియ శనివారం ఉదయం ప్రారంభమైంది. వెబ్ ఆప్షన్ల నమోదుకు ఆదివారం తుది గడువు. శనివారం 27,197 మంది వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. కొత్తగా మరిన్ని సీట్లు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో విద్యార్థులు వెబ్ ఆప్షన్ల నమోదులో తమ ప్రాధాన్యాలను మరోసారి సరిచూసుకోవాలని ఎప్‌సెట్ కన్వీనర్, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన సూచించారు. ఈ నెల 22వ తేదీ లోగా రెండో విడత సీట్ల కేటాయింపును ప్రకటిస్తామని వెల్లడించారు.