ప్రజల జీవితాల్లో మార్పుతోనే అభివృద్ధి
ABN , Publish Date - Jan 22 , 2026 | 05:10 AM
అభివృద్ధి అంటే కేవలం భవన నిర్మాణాలే కాదని, ప్రజల జీవితాల్లో మార్పు తేవడమే నిజమైన అభివృద్ధి అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.
హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తాం: డిప్యూటీ సీఎం భట్టి
వేగంగా ప్రాజెక్టుల నిర్మాణాలు: వ్యవసాయ మంత్రి తుమ్మల
వెనుకబడినవర్గాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం: మంత్రి అడ్లూరి
జగిత్యాల, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): అభివృద్ధి అంటే కేవలం భవన నిర్మాణాలే కాదని, ప్రజల జీవితాల్లో మార్పు తేవడమే నిజమైన అభివృద్ధి అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో విద్య, వైద్యంతో పాటు అన్ని రంగాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని అన్నారు. బుధవారం జగిత్యాల జిల్లా ధర్మపురి మున్సిపాలిటీలో మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌లతో కలిసి డిప్యూటీ సీఎం రూ.360 కోట్ల నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఒకే ప్రాంగణంలో విద్య, ఆటలు, హాస్టల్, ల్యాబ్స్, డైనింగ్ తదితర వసతులు ఉండేలా ప్రణాళిక రూపొందించి ఇంటిగ్రేటెడ్ మోడల్ పాఠశాలల నిర్మాణం చేస్తున్నామని డిప్యూటీ సీఎం తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చదువే ముఖ్యమని అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన వసతులు అందించాలనే రాష్ట్రంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో సాగునీరు అందించే ప్రాజెక్టుల నిర్మాణాలను వేగవంతం చేస్తున్నామని మంత్రి తుమ్మల అన్నారు. మైక్రో ఇరిగేషన్, డ్రిప్, స్ర్పింకర్ వంటి ఆధునిక నీటి పారుదల పద్ధతులను రైతులకు అందుబాటులోకి తీసుకొస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. ప్రభుత్వం కేవలం పథకాలను ప్రకటించడమే కాదు, వాటిని లబ్ధిదారులకు చేరేలా చర్యలు తీసుకుంటుందని చెప్పారు.