Share News

Road Accident: దారులన్నీ భాగ్యనగరం వైపు

ABN , Publish Date - Jan 19 , 2026 | 04:09 AM

సంక్రాంతి పండగ అనంతరం భాగ్య నగరానికి తిరుగు ప్రయాణమైన వాహనాలతో హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి-65పై ఆదివారం రద్దీ కొనసాగింది.

Road Accident: దారులన్నీ భాగ్యనగరం వైపు

కేతేపల్లి/చౌటుప్పల్‌ రూరల్‌/కోదాడ రూరల్‌/చిట్యాల రూరల్‌, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండగ అనంతరం భాగ్య నగరానికి తిరుగు ప్రయాణమైన వాహనాలతో హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి-65పై ఆదివారం రద్దీ కొనసాగింది. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలోని కొర్లపహాడ్‌ టోల్‌ప్లాజాలో రద్దీకి అనుగుణంగా హైదరాబాద్‌ వైపు 7 కౌంటర్లు, విజయవాడ వైపు ఐదు కౌంటర్ల నుంచి వాహనాలను అనుమతించారు. ఇక్కడ సాధారణ రోజుల్లో 10-12 వేల వాహనాలు వెళితే.. శని, ఆదివారాల్లో లక్ష వరకు వెళ్లి ఉంటాయని అంచనా. చౌటుప్పల్‌ మండలం పంతంగి టోల్‌ గేటు వద్ద 16 గేట్లకు గాను 12 గేట్ల నుంచి హైదరాబాద్‌ వైపు అనుమతించారు. సాధారణ రోజుల్లో 35 వేలకు పైగా వాహనాలు రాకపోకలు సాగిస్తుండగా ఆదివారం 55 వేల వాహనాలు రాకపోకలు సాగించాయి. పలు చోట్ల కార్లు ఒకదానికొకటి ఢీకొనటంతో ట్రాఫిక్‌ నిలిచిపోయింది. కొర్లపహాడ్‌ టోల్‌ ప్లాజా దాటగానే ఓ టీ హబ్‌ వద్ద మూడు కార్లు ఢీకొన్నాయి. చిట్యాల శివారులో వరుసగా మూడు కార్లు ఢీకొన్నాయి. కోదాడ మండలం దోరకుంట వద్ద కారు పంక్చర్‌ కావటంతో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురికి గాయాలయ్యాయి.

లారీ ఢీకొని ఒకరి మృతి..

భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలంలోని ఆందోల్‌ మైసమ్మ ఆలయ సమీపంలో జాతీయ రహదారిపై లారీ ఢీకొని ఓ మహిళ చనిపోయింది. రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌ మండలం గుర్రంగూడకు చెందిన పుట్టగళ్ల విక్రమ్‌, భార్య దుర్గ(28), కుమార్తె జాన్‌శ్రీ(4)తో కలిసి బైక్‌పై నల్లగొండ జిల్లా చెర్వుగట్టు వెళ్లారు. దైవ దర్శనం అనంతరం ఆదివారం తెల్లవారుజామున ఇంటికి పయనమయ్యారు. దండుమల్కాపురం ఆందోల్‌ మైసమ్మ ఆలయం సమీపంలోకి రాగానే గుర్తు తెలియని లారీ అతి వేగంతో వెనక నుంచి వీరిని ఢీకొట్టింది. దీంతో ముగ్గురూ కింద పడిపోయారు. దుర్గ తలపై నుంచి లారీ వెళ్లడంతో ఆమె మృతి చెందింది.

Updated Date - Jan 19 , 2026 | 04:09 AM