Share News

రేవంత్‌ది తాలిబన్‌ తరహా పాలన: కవిత

ABN , Publish Date - Jun 09 , 2026 | 05:22 AM

రాష్ట్రంలోని ఆడపిల్లలకు, పేదలకు చదువును దూరంచేస్తున్న సీఎం రేవంత్‌ రెడ్డి హిట్లర్‌ మాత్రమే కాదు తాలిబన్‌ కూడా అని తెలంగాణ రక్షణ సేన...

రేవంత్‌ది తాలిబన్‌ తరహా పాలన: కవిత

హైదరాబాద్‌, జూన్‌ 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఆడపిల్లలకు, పేదలకు చదువును దూరంచేస్తున్న సీఎం రేవంత్‌ రెడ్డి హిట్లర్‌ మాత్రమే కాదు తాలిబన్‌ కూడా అని తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్‌) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఒక ప్రకటనలో విమర్శించారు. రాష్ట్రంలోని 27వేల ప్రభుత్వ పాఠశాలలను 4 వేలకు కుదిస్తామన్న ముఖ్యమంత్రిపై ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. తాలిబన్‌లు ఆడబిడ్డలకు చదువును దూరంచేశారని.. అదే తరహాలో రేవంత్‌ రెడ్డి ప్రభుత్వ స్కూళ్లను మూసేసి బాలికలకు విద్యావకాశాలు లేకుండా చేసేందుకు కుట్ర పన్నుతున్నారన్నారు. 27వేల స్కూళ్లలో పనిచేస్తున్న 3 లక్షలకు పైగా ప్రభుత్వ టీచర్లను ఏం చేస్తారో చెప్పాలని, క్రమేణా ప్రభుత్వ విద్యను పేదలకు దూరంచేసి ప్రైవేటీకరించాలని చూస్తున్నారా..? అని ప్రశ్నించారు. అంతకుముందు బంజారాహిల్స్‌లోని టీఆర్‌ఎస్‌ కార్యాలయంలో 57 ఎస్సీ ఉప కులాల నాయకులతో ఆమె సమావేశమయ్యారు. ఆమె మాట్లాడుతూ ఎస్సీల్లో 57 ఉప కులాలుంటే అందులో 47 ఉపకులాలకే ఆర్డీవోలు క్యాస్ట్‌ సర్టిఫికెట్లు జారీచేయడం విచారకరమన్నారు. అన్ని కులాలకు తహసీల్దార్‌లే వీటిని ఇచ్చేలా ఒత్తిడి తెస్తామన్నారు.

Updated Date - Jun 09 , 2026 | 05:22 AM