Share News

అట్టహాసంగా టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ సభ

ABN , Publish Date - Apr 26 , 2026 | 05:01 AM

తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్‌ఎస్‌) పార్టీ ఆవిర్భావ సభ ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. జాగృతి మహిళా కార్యకర్తలు పెద్ద ఎత్తున బతుకమ్మలు, బోనాలతో ....

అట్టహాసంగా టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ సభ

  • వెయ్యి బస్సుల్లో జాగృతి కార్యకర్తల రాక

  • ఇందులో 60 శాతానికి పైగా మహిళలే

  • నోరూరించే వంటకాలతో భోజనాలు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్‌ఎస్‌) పార్టీ ఆవిర్భావ సభ ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. జాగృతి మహిళా కార్యకర్తలు పెద్ద ఎత్తున బతుకమ్మలు, బోనాలతో పాల్గొని సభకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గోండులు, లంబాడీలతోపాటు ఇతర గిరిజన తెగల కార్యకర్తలు తమ సంప్రదాయ నృత్యాలతో పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవితకు ఘన స్వాగతం పలికారు. సభకు వెయ్యికిపైగా బస్సులు, ఇతర వాహనాల్లో జాగృతి కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. ఇందులో 60శాతం పైగా మహిళలే ఉండటం గమనార్హం. సభ ప్రాంగణం ఆవరణలో భారీ డిజిటల్‌ స్ర్కీన్లు ఏర్పాటు చేయగా, డీజే సౌండ్స్‌తో మార్మోగిపోయింది. సభకు హాజరైన వారి కోసం భారీ స్థాయిలో భోజన ఏర్పాట్లు చేశారు. మాంసాహారుల కోసం మటన్‌, చికెన్‌, నాటుకోడి, చేపల పులుసు, బోటి, తలకాయ, గుడ్డు చారు, చికెన్‌ ధమ్‌ బిర్యానీ వంటి వంటకాలు, శాకాహారుల కోసం వంకాయ పూర్ణం, పప్పు, పన్నీరు, సాంబారు, పెరుగు, అప్పడం, మిరపకాయ బజ్జీలు అందించారు. సభా ప్రాంగణంలోకి ప్రవేశించిన కవిత... తొలుత అమరవీరుల స్థూపానికి, డాక్టర్‌ అంబేడ్కర్‌, తెలంగాణ తల్లి విగ్రహాలకు పుష్పాభివందనం చేసి స్టేజీపైకి చేరుకున్నారు. అనంతరం పలువురు నేతలు, కార్యకర్తలను ఆప్యాయంగా పలకరించారు. ఈ క్రమంలో అభిమానులు ‘‘సీఎం సీఎం’’ అంటూ నినాదాలు చేస్తూ హోరెత్తించారు. పార్టీ పేరు ప్రకటించిన తర్వాత ప్రసంగం ప్రారంభించిన కవిత సుమారు 50 నిమిషాల పాటు ఎలాంటి తడబాటు లేకుండా ఆత్మవిశ్వాసంతో మాట్లాడారు. అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. తన తండ్రి కేసీఆర్‌, ప్రస్తుత సీఎం రేవంత్‌ విధానాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్టీ ప్రకటన అనంతరం క్యాడర్‌తో కలిసి కవిత భారీ ర్యాలీగా హైదరాబాద్‌కు తిరిగివచ్చారు.

Updated Date - Apr 26 , 2026 | 05:01 AM