Share News

గిరిగిరి ఫైనాన్స్‌లతో పరేషాన్‌....

ABN , Publish Date - Sep 20 , 2026 | 11:32 PM

మంచిర్యాల జిల్లాలో ’’గిరిగిరి’’ దందా ప్రజలను పరేషాన్‌ చేస్తోంది. పేద, మధ్యతరగతి వర్గాల ఆర్థిక అవసరాలే లక్ష్యంగా ఈ వ్యాపారం జోరుగా సాగుతోంది. చిరు వ్యాపారులు పెట్టబడి కోసం, సామాన్య ప్ర జలు అవసరాల కోసం తీసుకుంటున్న అప్పు చివరికి వారి మెడకు చుట్టుకుంటోంది.

గిరిగిరి ఫైనాన్స్‌లతో పరేషాన్‌....

-సామాన్యుల నడ్డి విరుస్తున్న అధిక వడ్డీ

-చిరు వ్యాపారులు, మధ్య తరగతి ప్రజల అవసరాలే పెట్టుబడి

-ష్యూరిటీ కింద వాహనాలు, బంగారం, ఖాళీ చెక్కులు తాకట్టు

-పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ప్రైవేట్‌ ఫైనాన్సులు

మంచిర్యాల, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): మంచిర్యాల జిల్లాలో ’’గిరిగిరి’’ దందా ప్రజలను పరేషాన్‌ చేస్తోంది. పేద, మధ్యతరగతి వర్గాల ఆర్థిక అవసరాలే లక్ష్యంగా ఈ వ్యాపారం జోరుగా సాగుతోంది. చిరు వ్యాపారులు పెట్టబడి కోసం, సామాన్య ప్ర జలు అవసరాల కోసం తీసుకుంటున్న అప్పు చివరికి వారి మెడకు చుట్టుకుంటోంది. రోజు రోజుకూ కిస్తీలు చెల్లించలేక అవస్థలు పడుతున్నారు. వాయిదాలు చెల్లించని పక్షంలో ఫైనాన్స్‌ వ్యాపారులు పెట్టే బాధలు మామూలుగా ఉండటంలేదు. కుటుంబ సభ్యులు, కాలనీ వాసుల ఎదుటే అవమానపరుస్తూ బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు. వడ్డీల మీద వడ్డీలు చెల్లించలేక బాధితులు చివరికి బలవన్మరణాలకు పాల్పడటమో, ఊరు వదిలి వెళ్లిపోవడమో చేస్తుంటారు. వ్యాపార కేంద్రంగా విరాజిల్లుతున్న జిల్లాలో గిరిగిరి దందా జోరుగా సాగుతోంది. గిరిగిరి (దినసరి) చిట్టీల వ్యాపారంలో రోడ్లపై వ్యాపారాలు చేసే చిరువ్యాపారులు, సామాన్య ప్రజలు చిక్కుకుని బలవుతుండగా జిల్లా కేంద్రంలో ఈ పరిస్థితి మరింత ధారుణంగా ఉంది.

గిరిగిరి వ్యాపారం అంటే....

సామాన్య ప్రజలు ఏదైనా అవసరం కోసం ఒక వ్యక్తి నుంచి చిన్న మొత్తంలో డబ్బు తీసుకొని దినసరి వాయిదా పద్ధతిలో తిరిగి చెల్లిండాన్నే గిరిగిరి ఫైనాన్స్‌ వ్యాపారంగా పిలుస్తారు. ఎవరైనా వ్యక్తి తన అవసర నిమిత్తం వ్యాపారి నుంచి రూ. 10వేలు అప్పుగా తీసుకుంటే అతనికి రూ. 9వేలు మాత్రమే చేతికి వస్తుంది. మిగతా వేయి రూపాయలు వడ్డీ కింద ముందే మినహాయించుకుంటారు. అప్పు తీసుకున్న రోజు నుంచి వంద రోజుల వరకు ప్రతి రోజూ రూ. 100 చొప్పున వ్యాపారికి చెల్లించాలి. అంటే సగటున నెలకు రూ. 100కు రూ. 10 మిత్తి చెల్లించాలి. అలాగే ముందుగా రూ. 10వేలు అప్పు తీసుకుంటే నెలకు రూ. 2 వేల చొప్పున పది నెలలు చెల్లించాల్సి ఉంటుంది. అనివార్య కారణాలవల్ల మధ్యలో ఒక్క నెల డబ్బులు చెల్లించకున్నా మరో రూ. 2వేలు ఫైన్‌తో కలిపి చెల్లించాల్సి ఉంటుంది. అలాగే మరో పద్ధతిలో నెలసరి చెల్లింపులు ఉంటాయి....ఈ పద్ధతిలో నెలకు వడ్డీ రూ. 6 చొప్పున వసూలు చేస్తారు. రూ. 10వేలు అప్పు పొందిన వ్యక్తికి ముందుగానే వడ్డీ రూ. 600 మినహాయించుకొని, మిగతా రూ. 9,400 ఇస్తారు. అతను ప్రతి నెల రూ. 600 చొప్పున వడ్డీ చెల్లించాలి. అసలు తీర్చేదాకా ఇలా వడ్డీ చెల్లిస్తూనే ఉండాలి. మధ్యలో ఆగితే అక్కడి నుంచి మిగిలిన దానిని కొత్త అప్పు కింద లెక్కగడతారు.

అవసరాల కోసం అప్పులు....

చిన్నా చితక వ్యాపారాలు చేసుకొనే వారు పెట్టుబడి కోసం, మధ్య తరగతి ప్రజలు ఇతరత్రా అవసరాల కోసం గిరిగిరి వ్యాపారులను ఆశ్రయిస్తుంటారు. ఆశించిన మేర వ్యాపారం కొనసాగక ఫైనాన్స్‌ వ్యాపారుల వేధింపులకు గురి అవుతున్నారు. పరువు కోసం తమ షాపులు, ఇతర వస్తువులు అమ్ముకొని డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితుల్లో చిక్కుకుంటున్నారు. రోజుకు రూ. 200 నుంచి రూ. 500 వరకు సంపాదించే ఆటో డ్రైవర్లు, కూరగాయల వ్యాపారులు, చిరు వ్యాపారులు, పాన్‌ టేలాల నిర్వాహకులు, బైక్‌ మెకానిక్‌లు కిస్తీలు చెల్లించలేక బకాయిలు ఉన్న డబ్బునే మళ్లీ అప్పుగా మరల్చుకొని చక్రవడ్డీ కడుతున్నారు. కిస్తులు చెల్లించని వారి పరిస్థితి అత్యంత దయనీంగా ఉంటుంది. వ్యాపారులు నేరుగా ఇళ్ల వద్దకు వచ్చి కుటుంబ సభ్యుల ముందే అసభ్య పదజాలంతో దూషిస్తారని బాధితులు చెబుతున్నారు. అంతేగాక ఇంట్లో ఉన్న విలువైన వస్తువులను దౌర్జన్యంగా లాక్కొని వెళ్తున్నట్లు వాపోతున్నారు. ష్యూరిటీ కింద ఇచ్చిన ఖాళీ చెక్కులతో కేసులు వేస్తూ తీవ్ర మానసిక క్షోభకు గురి చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

విచ్చల విడిగా వెలుస్తున్న ఫైనాన్స్‌లు...

జిల్లా కేంధ్రంలో రోజు రోజుకూ గిరిగిరి ఫైనాన్స్‌లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. గిరిగిరితోపాటు ప్రైవేటు ఫైనాన్స్‌ వ్యాపారంలో అన్ని రంగాల వారు ఉన్నారు. వ్యాపారులు, గృహిణులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు......కొంత మొత్తం లో పెట్టుబడిగా పెట్టి ఈ వ్యాపారంలోకి దిగుతున్నారు. ఉద్యోగులైతే విధులు ముగియగానే బైక్‌లపై తిరుగుతూ వసూళ్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. సాయంత్రం అయిం దంటే చాలూ చుట్టు పక్కల ఊర్ల నుంచి వ్యాపారులు పట్టణంలో చేరి, వసూళ్లలో మునిగిపోతారు. వీరు డబ్బు అప్పుగా ఇచ్చే ముందు బంగారు అభరణాలు, ద్విచక్ర వాహనాలు, ఖాళీ చెక్కులు, విలువైన సెల్‌ఫోన్లు, ఇంట్లో సామగ్రిని సైతం తాకట్టు పెట్టుకొంటారు. జిల్లాలో గిరిగిరి, ప్రైవేటు ఫైనాన్స్‌లు రెండు వేలదాకా ఉన్నాయంటే ఈ వ్యాపారం ఎంత లాభసాటిగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

పక్కా జీరో దందా....

గిరిగిరి ఫైనాన్స్‌లు నిర్వహించే వ్యాపారులు ఎలాంటి రికార్డులు మెయింటన్‌ చేయరు. వీరికి ఎలాంటి కార్యాలయాలు కూడా ఉండవు. ఎక్కడో ఒక చోట కూర్చుని తమ వ్యాపారాలను నిర్వహిస్తూ ఉంటారు. మార్కెట్లో ప్రస్తుతం వడ్డీ వ్యాపారాన్ని మించిన బిజినెస్‌ లేదంటే అతిశయోక్తికాదు. నెలకు కోట్ల రూపాయల్లో వ్యాపారం చేసే వ్యాపారులు ఒక్కపైసా కూడా ప్రభుత్వానికి చెల్లించడంలేదు. చిన్న కిరాణషాపు నిర్వహించే వారు సైతం విధిగా సంబంధితశాఖ నుంచి లైసెన్సులు పొందాలి. అందు కోసం సంబంధిత అధికారులకు చేతులు తడపాలి. కేవలం బతుకుదెరువు కోసం చిరు వ్యాపారాలు చేసే వారికి ఉన్న నిబంధనలు.... కోట్లలో వ్యాపారం చేసే గిరిగిరి, ఫైనా న్స్‌ వ్యాపారులకు వర్తించకపోవడం గమనార్హం. ఫైనాన్స్‌ నిర్వాహకుల ఇళ్లు, కార్యాల యాల్లో పోలీసులు అడపాదడపా తనిఖీలు నిర్వహిస్తున్నప్పటికీ కఠిన చర్యలు లేకపో వడంతో కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతున్నాయి.

Updated Date - Sep 20 , 2026 | 11:32 PM