Share News

మావోయిస్టుల అడ్డాల్లో తిరంగా రెపరెపలు

ABN , Publish Date - Aug 16 , 2026 | 06:42 AM

అవి ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లా ఊసూరు బ్లాక్‌లోని కర్రె గుట్టలకు ఆనుకొని ఉండే పెద్ద ఉట్లపల్లి, చిన్న ఉట్లపల్లి, రాంపురం గ్రామాలు. ఈ ఏడాది మార్చి వరకు..

మావోయిస్టుల అడ్డాల్లో తిరంగా రెపరెపలు

  • 80 ఏళ్లలో తొలిసారిఎగిరిన జాతీయ జెండా

  • బీజాపూర్‌ జిల్లా ఊసూరు బ్లాక్‌లో వేడుకలు

చర్ల, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి) : అవి ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లా ఊసూరు బ్లాక్‌లోని కర్రె గుట్టలకు ఆనుకొని ఉండే పెద్ద ఉట్లపల్లి, చిన్న ఉట్లపల్లి, రాంపురం గ్రామాలు. ఈ ఏడాది మార్చి వరకు కూడా ఈ గ్రామాలన్నీ మావోయిస్టుల అధీనంలో ఉన్నాయి. అయితే ‘ఆపరేషన్‌ కగార్‌’తో మావోయిస్టులు ఆ ప్రాంతాలను ఖాళీ చేశారు. ప్రస్తుతం ఆ గ్రామాలను కేంద్ర బలగాలు అధీనంలోకి తీసుకున్నాయి. దీంతో ఆయా గ్రామాల్లో అంగన్‌వాడీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. శనివారం స్వాతంత్య్ర దినోత్సవం కావడంతో.. ఆయా అంగన్‌వాడీల ముందు కేంద్ర బలగాలు.. స్థానికులతో జాతీయ జెండాలను ఎగుర వేయించారు. స్వాతంత్య్రం వచ్చిన 80 ఏళ్లకు ఆ గ్రామాల్లో మొదటిసారి జాతీయ జెండా రెపరెప లాడింది. పిల్లలు, పెద్దలు అందరూ పాల్గొని జాతీయ గీతాలను ఆలపించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలకు వెళ్లిన ‘ఆంధ్రజ్యోతి’ అక్కడి ప్రజలను పలకరించింది. తమకు ఇప్పటిదాక ఆగస్టు 15 అంటే తెలియదని, కానీ నేడు తెలుసుకుంటున్నామని కొంతమంది తెలిపారు. తమ గ్రామాల్లో జాతీయ జెండాలు ఎగుర వేయడం సంతోషంగా ఉందన్నారు. కాగా.. కొంత కాలంగా ఈ మూడు గ్రామాల పరిసరాల్లో ఆగస్టు 15, జనవరి 26న మావోయిస్టులు నల్లజెండాలు ఎగుర వేసేవారు. అనేక ఘటనల్లో స్థానికులను ఇన్‌ఫార్మర్లుగా ఆరోపిస్తూ.. హత్య చేశారు. కానీ నేడు ‘ఆపరేషన్‌ కగార్‌’తో ఆయా గ్రామాలు అభివృద్ధికి దగ్గరవుతున్నాయి.

Updated Date - Aug 16 , 2026 | 06:44 AM