గిరిజన విద్యార్థికి 6 సర్కారు కొలువులు !
ABN , Publish Date - May 12 , 2026 | 04:34 AM
కృషి ఉంటే ఏదైనా సాధించొచ్చని నిరూపించాడు ఓ గిరిజన విద్యార్థి. ఏకంగా ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి శభాష్ అనిపించుకుంటున్నాడు.
కౌడిపల్లి, మే 11 (ఆంధ్రజ్యోతి) : కృషి ఉంటే ఏదైనా సాధించొచ్చని నిరూపించాడు ఓ గిరిజన విద్యార్థి. ఏకంగా ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి శభాష్ అనిపించుకుంటున్నాడు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం రాయిలాపూర్‌తండాకు చెందిన బోజ్యానాయక్, శోభారాణిలకు నలుగురు సంతానం. రెండో కుమారుడు నవీన్‌కుమార్ మండలంలోని తునికిలో ఎంజేపీ గురుకులలో ఇంటర్మీడియట్ పూర్తిచేశాడు. అనంతరం హైదరాబాద్‌లోని నిజాం కళాశాల, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి అర్థశాస్త్రంలో పట్టభద్రుడయ్యాడు. క్రమశిక్షణతో చదువుకుని ఎల్‌ఐసీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (ఏఏవో), న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (ఎన్‌ఐఏసీఎల్), కెనరా బ్యాంకులో ప్రొబేషనరీ అధికారి, క్లర్క్, ఎస్‌బీఐలో జూనియర్ అసోసియేట్, ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ (ఓఐసీఎల్)లో అసిస్టెంట్ ఆఫీసర్‌గా మొత్తం ఆరు ఉద్యోగాలు సాధించారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ.. తల్లిదండ్రుల సహకారంతో కోచింగ్ తీసుకున్నానని, జనవరి నుంచి మే వరకు విడుదలైన పరీక్షల ఫలితాల్లో ఈ ఉద్యోగాలు సాధించినట్లు చెప్పారు. భవిష్యత్‌లో ఆర్‌బీఐ గ్రేడ్ బీ ఉద్యోగం సాధించడమే తన లక్ష్యమని చెప్పాడు.