kumaram bheem asifabad- అడవుల రక్షణకు ‘ట్రెంచ్’
ABN , Publish Date - Feb 05 , 2026 | 10:26 PM
జిల్లాలో అడవులను సంరక్షించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ట్రెంచ్(కందకాలు) వ్యవస్థను ఐదేళ్ల క్రితం ఏర్పాటు చేసింది. ఫారెస్టు భూములకు హద్దులను గుర్తించి కందకాలను తవ్వించింది. జిల్లాలో ఈ ప్రక్రియ పూర్తి కావడంతో అడవిలోని తాత్కాలిక రోడ్లు మూసుకుపోయాయి. అటవీ శాఖ భూముల ఆక్రమణకు గురి కాకుండా చక్కటి ఫలితాలనిచ్చింది.
కాగజ్‌నగర్, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో అడవులను సంరక్షించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ట్రెంచ్(కందకాలు) వ్యవస్థను ఐదేళ్ల క్రితం ఏర్పాటు చేసింది. ఫారెస్టు భూములకు హద్దులను గుర్తించి కందకాలను తవ్వించింది. జిల్లాలో ఈ ప్రక్రియ పూర్తి కావడంతో అడవిలోని తాత్కాలిక రోడ్లు మూసుకుపోయాయి. అటవీ శాఖ భూముల ఆక్రమణకు గురి కాకుండా చక్కటి ఫలితాలనిచ్చింది. జిల్లాలోని ఆసిఫాబాద్, సిర్పూరు నియోజకవర్గాల్లోని ఈ ప్రక్రియను పూర్తి చేశారు. అటవీ ప్రాంతానికి అధికారులు హద్దు లు విధించి రెండు మీటర్ల వెడల్పు, రెండు మీటర్ల లోతుతో మొత్తం వంద కిలోమీటర్ల చుట్టు కొలతతో అడవి చుట్టు కందకాలను తవ్వారు. ఇందు కోసం ఎక్స్‌కవేటర్లుతో పనులు పూర్తి చేశారు. ఈ ట్రెంచ్ ఏర్పాటుతో ఫారెస్టు భూముల చుట్టు బౌండరీ లైన్ ఏర్పాటైంది.
- వన్యప్రాణులకు ఆపద వాటిల్లకుండా..
అడవుల్లోకి వేటగాళ్లు ప్రవేశించి వన్యప్రాణులకు ఆపద వాటిల్లకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కందకాల ఏర్పాటుతో అడవుల నుంచి కలప తరలింపునకు పూర్తి స్థాయిలో నిలిచిపోయినట్లయింది. దీని వల్ల వాన నీటిని సంరక్షించే వీలుంది. నీటి నిల్వతో అడవిలోని మొక్కలు, చెట్లకు నీటి కొరత ఉండదని అధికారులు చెబుతున్నారు. కాగా ట్రెంచ్‌లతో అటవీ భూముల్లో నుంచి డొంక రోడ్లు పూర్తిగా మూసుకు పోవడంతో రైతులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అటవీ ప్రాంతానికి ఆనుకొని ఉన్న గ్రామాల్లో కొంత మంది రైతులకు ఈ సమస్య తలెత్తుతోంది. అటవీ భూములు పక్కాగా లెక్కలు తేలడంతో ఖాళీ స్థలాల్లో ఉసిరి, చింత, టేకు, వెదురు, తదితర మొక్కలను పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అటవీ భూములు ఆక్రమణలకు గురవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కార్యాచరణ రూపొందించిన ట్రెంచ్ వ్యవస్థ చక్కటి ఫలితాల నిచ్చింది. రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు వివాదాస్పద భూములపై ఏడాది క్రితం రెండు నెలల పాటు సర్వేలు నిర్వహించారు. ఈ సర్వేల్లో అటవీ శాఖకు వచ్చిన భూము ల్లో కూడా పక్కాగా హద్దులు వేసి కందకాలు తవ్వారు. అటవీ ప్రాంతంలోకి అక్రమంగా చొరబడే అవకాశం పూర్తిగా నిలిచిపోనుంది. పూర్తిగా ట్రెంచ్‌లు ఏర్పాటు చేసి ఉండడంతో రోడ్డు మీదుగానే రాకపోకలు సాగించాలి. ఈ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో కలప, ఇతర అక్రమ రవాణా పూర్తిగా నిలిచి పోయింది. ట్రెంచ్ వ్యవస్థ పూర్తయిన వాటిలో అటవీ శాఖ అధికారులు హద్దులు వేసి వాటిని ఆన్‌లైన్ అప్‌లోడ్ చేశారు. అటవీ శాఖ ద్వారా ఆధునికంగా ఏర్పాటు చేసిన శాటిలైట్ మ్యాప్‌లో పక్కాగా రూపొందించారు. వీటితో పెండింగ్‌లో ఉన్న పోడు భూముల విషయంలో కూడా సర్వేలు రూపొందించారు. వీటికి కూడా హద్దులు వేసే ప్రక్రియలో అధికారులు చర్యలు తీసుకుం టున్నారని చెబుతున్నారు.