‘ట్రెజరీ’ పదోన్నతులకు మళ్లీ పాత ప్రతిపాదనే
ABN , Publish Date - Feb 21 , 2026 | 02:55 AM
రాష్ట్ర ఆర్థిక శాఖ పరిధిలోని ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డైరెక్టరేట్(డీటీఏ) కింద ఐదేళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న అధికారుల పదోన్నతుల వ్యవహారం ఎటూ తేలడం లేదు.
న్యాయ శాఖ తిరస్కరించినా.. ‘20 సైకిల్’తోనే ఫైలు
‘10 సైకిల్’ అమలు కోసం అధికారుల డిమాండ్
ఐదేళ్లుగా పెండింగ్‌లో ప్రమోషన్లు
హైదరాబాద్, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఆర్థిక శాఖ పరిధిలోని ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డైరెక్టరేట్(డీటీఏ) కింద ఐదేళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న అధికారుల పదోన్నతుల వ్యవహారం ఎటూ తేలడం లేదు. దీంతో ప్రమోషన్ల కోసం ట్రెజరీ, అకౌంట్స్ విభాగం అధికారులు ఆందోళన చెందుతున్నారు. డీటీఏ పంపించిన ఫైలులో సవరణలు చేసి పంపించాలంటూ న్యాయ శాఖ సూచించినా, ఆర్థిక శాఖ అధికారులు పదోన్నతుల విషయంలో పాత పద్ధతినే సిఫారసు చేస్తూ ఫైలును రూపొందించారన్న విమర్శలున్నాయి. జిల్లాల్లో పని చేసే సబ్ ట్రెజరీ ఆఫీసర్(ఎ్‌సటీవో)లు, డైరెక్టరేట్‌లో పని చేసే జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్(జేఏవో)లకు పదోన్నతులు ఇవ్వడం ద్వారా అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్(ఏటీవో), అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్(ఏఏవో) పోస్టులను భర్తీ చేస్తారు. కొన్నింటిని ప్రత్యక్ష ఎంపిక(డీఆర్) విధానంలో భర్తీ చేస్తారు. అయితే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణకు ఒకే ఒక మల్టీ జోన్(3) ఉండేది. అప్పుడు ‘20 సైకిల్’ ఆధారంగా పదోన్నతులు ఇచ్చేవారు. అంటే, ట్రెజరీ విభాగానికి చెందిన ఎస్‌టీవోలకు 9, అకౌంట్స్ విభాగానికి చెందిన జేఏవోలకు 5 పోస్టుల అవకాశం కల్పించి పదోన్నతులిస్తూ ఏటీవో, ఏఏవో పోస్టులను భర్తీ చేసేవారు. మిగతా 6 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేసేవారు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో రెండు మల్టీ జోన్లను ఏర్పాటు చేశారు. దీనికి అనుగుణంగా ‘గెజిటెడ్ సర్వీస్ రూల్స్’ను సవరించి ‘20 సైకిల్’కు బదులుగా ఒక్కో మల్టీ జోన్‌కు ‘10 సైకిల్’ పోస్టులతో డైరెక్టరేట్ ఫైలును తయారు చేసి ఆర్థిక శాఖకు పంపింది. అంటే, ఒక్కో మల్టీ జోన్‌లో ఎస్‌టీవోలకు 5, జేవోలకు 2, డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కింద 3 పోస్టులను ప్రతిపాదించింది.
ఈ ఫైలులో ఆర్థిక శాఖ కొర్రీలు పెట్టి, ‘20 సైకిల్’తో పంపించగా న్యాయ శాఖ తిరస్కరించింది. ఒక్కో మల్టీ జోన్‌కు ‘10 సైకిల్’తో ఫైలును తయారు చేసి పంపించాలని సూచించింది. అయినా, ఆర్థిక శాఖ మళ్లీ ‘20 సైకిల్’తోనే తాజా ఫైలును తయారు చేసినట్లు తెలిసింది. ఇలా ఒక్కో మల్టీజోన్‌కు 20 సైకిల్‌ను అమలు చేస్తే రెండు జోన్లకు కలిపి 40 పోస్టుల్లో పదోన్నతుల పోస్టులు 28 ఖాళీ కావాల్సి ఉంటుందని, అంత పెద్దమొత్తంలో ఒకేసారి పోస్టులు ఖాళీ కాబోవని అకౌంట్స్ విభాగం వారు వివరిస్తున్నారు. అందుకే ఐదేళ్ల నుంచి పదోన్నతుల ప్రక్రియను చేపట్టడం లేదని, తద్వారా సీనియర్లకు పదోన్నతులు లభించడం లేదని ఆరోపిస్తున్నారు. ఒక్కో జోన్‌లో 10 సైకిల్‌ను అమలు చేస్తే ఏడేసి చొప్పున రెండు జోన్లకు కలిపి 14 ఖాళీలు ఏర్పడతాయని, పదోన్నతులకు వీలవుతుందని చెబుతున్నారు. ఈ విధానాన్ని అమలు చేయాలంటూ ఆర్థిక శాఖను కోరుతున్నా పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు. పైగా ఆర్థిక శాఖలోని కొంత మంది అధికారులు తమకు సంబంధం లేకపోయినా అత్యుత్సాహంతో ‘20 సైకిల్’ను ముందుకు తెస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఒక్కో మల్టీ జోన్‌కు ‘10 సైకిల్’ను అమలు చేస్తూ పదోన్నతులకు మార్గం సుగమం చేయాలని కోరుతున్నారు. సచివాలయంలోని సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులను విభాగాధిపతుల కార్యాలయాల అధికారులతో భర్తీ చేసే సందర్భంలో అకౌంట్స్ విభాగం అధికారులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.