kumaram bheem asifabad-పరిమితికి మించి ప్రయాణం
ABN , Publish Date - Mar 01 , 2026 | 10:20 PM
రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు ఓ వైపు అవగాహన కల్పిస్తున్నా కొందరు నిర్లక్ష్యం వీడడం లేదు. ప్రమాదమని తెలిసినా శుభకార్యాలయాలకు, ఇతరాత్ర అవసరాలకు ప్రైవేటు వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణిస్తున్నారు. చౌక ప్రయాణమని లారీలు, ట్రాక్టర్లు, బొలేరో, వ్యాన్లు ఇతర వాహనాలను ఆశ్రయిస్తున్నారు.
- అధికారులు అవగాహన కల్పిస్తున్నా మారనితీరు
సిర్పూర్(టి), మార్చి 1 (ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు ఓ వైపు అవగాహన కల్పిస్తున్నా కొందరు నిర్లక్ష్యం వీడడం లేదు. ప్రమాదమని తెలిసినా శుభకార్యాలయాలకు, ఇతరాత్ర అవసరాలకు ప్రైవేటు వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణిస్తున్నారు. చౌక ప్రయాణమని లారీలు, ట్రాక్టర్లు, బొలేరో, వ్యాన్లు ఇతర వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఇటీవల తరచూ ప్రమాదాలు జరుగుతుండడంతో బాధిత కుటుంబాలు తీవ్రంగా నష్ట పోతున్నాయి. ఒక వైపు పెళ్లిళ్లు, ఇతర శుభాకార్యాలు ఉండడంతో ఆర్టీసీ బస్సుల కొరత ఏర్పడుతుంది. ఈ క్రమంలో చాలా మంది చౌకగా వస్తున్న ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని యజమానులు కూడా జాగ్రత్తలు పాటించకుండా సామర్థ్యానికి మించి ప్రజలను తరలిస్తున్నారు. వందల కిలో మీటర్ల దూరం ఫిట్‌నెస్ లేని వాహనాలను వినియోగిస్తున్నారు. అధిక లోడ్ నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో ప్రమాదాలు జరుగుతున్నాయి. శుభకార్యాలకు ప్రభుత్వం ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించినా అవగాహన లేక జిల్లాలో చాలా మంది వినియోగించుకోవడం లేదు.
రోడ్డు భద్రత మాసోత్సవాల్లో..
రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా అధికారులు రోడ్డు నిబంధనలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. అయినా ప్రమాదాలకు అడ్డకట్ట పడడం లేదు. జిల్లాలో నిబంధ నలకు విరుద్దంగా శుభకార్యాలు, జాతరలకు ప్రైవేటు వాహనాలను వినియోగిస్తున్నారు. వాహనాల్లో మహిళలు, వృద్దులు, పిల్లలను కిక్కిరిసి ఎక్కిస్తున్నారు. గతేడాది ఏప్రిల్ 29న చింతలమానేపల్లి మండలం కోయపలిఇ్ల గ్రామ సమీపంలో శుభకార్యానికి వెళ్లి వస్తున్న ట్రాక్టర్ బోల్తా పడడంతో ఇద్దరికి గాయాలు అయ్యాయి. ట్రాక్టర్ అదుపు తప్పి కింద పడడంతో తొమ్మిది మంది ట్రాక్టర్ ట్రాలీ కింద చిక్కుకున్నారు. స్థానికులు, పోలీసుల సహయంతో వారిని రక్షించారు. ఇలాంటి ఘటనలు జిల్లాలో సర్వ సాధారణంగా మారాయి. అయినా సంబంధిత అధికారులు తనిఖీలు చేపట్టి జరిమానాలు విధించడం లేదు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో పలు జాతరలు కొనసాగుతు న్నాయి. ఈ నేపథ్యంలో వాహనాలపై అధికారులు నిఘా ఉంచాల్సిన అవసరం ఉంది.
నిర్లక్ష్యం వద్దు..
- వహీదుద్దీన్, డీఎస్పీ, కాగజ్‌నగర్
వాహనం నడిపే సమయంలో డ్రైవర్లు నిర్లక్ష్యంగా ఉండొద్దు. అతివేగం, అజాగ్రత్త కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. పరిమితికి మించి వెళ్తే ప్రమాద తీవ్రత ఎ క్కువగా ఉంటుంది. నిబంధనలు పాటించని ప్రైవేటు వాహనాల యజమానులపై చర్యలు తీసుకుంటున్నాం. వాహనదారులు రోడ్డు నిబంధనలు పాటించాలి.