Share News

ఓవర్‌లోడింగ్‌పై రవాణాశాఖ కొరడా

ABN , Publish Date - Jun 27 , 2026 | 06:38 AM

రాష్ట్రవ్యాప్తంగా క్వారీలు, వివిధ పారిశ్రామిక సంస్థల నుంచి పరిమితికి మించి సరుకు రవాణా చేస్తున్న వ్యవహారంపై రవాణా శాఖ కొరడా ఝళిపించింది.

ఓవర్‌లోడింగ్‌పై రవాణాశాఖ కొరడా

  • ఒక్క ట్రిప్పులో రెండింతల లోడు కుదరదు

హైదరాబాద్‌, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా క్వారీలు, వివిధ పారిశ్రామిక సంస్థల నుంచి పరిమితికి మించి సరుకు రవాణా చేస్తున్న వ్యవహారంపై రవాణా శాఖ కొరడా ఝళిపించింది. నిబంధనలు ఉల్లంఘించి ఓవర్‌లోడ్‌కు పాల్పడే క్వారీలు, కంపెనీలు, వాహన దారులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. క్వారీలు, కంపెనీలు రవాణా ఖర్చులు మిగుల్చుకునేందుకు ఒక్క ట్రిప్పులో రెండింతల లోడు తరలిస్తున్నారని, అందుకు అనుగుణంగా ఆయా విభాగాల వారు వే బిల్లులు, ట్రాన్సిట్‌ రసీదులు జారీ చేస్తున్న విషయం రవాణాశాఖ ఇటీవల నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో వెల్లడైంది. అలా చేయడం మోటారు వాహనాల చట్టం 1988, మైనింగ్‌ నిబంధనలతో పాటు సుప్రీంకోర్టు, హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడమేనని కమిషనర్‌ కార్యాలయం గురువారం కీలక సర్క్యులర్‌ జారీ చేసింది. రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌(ఆర్‌సీ)లో అనుమతించిన గ్రాస్‌ వెహికల్‌ వెయిట్‌ (జీవీడబ్ల్యూ) దాటకుండా సరుకు లోడ్‌ చేయాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలు తప్పవని స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వులను డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్లు (డీటీసీ) జిల్లా రవాణా అధికారులు (డీటీవో) తమ పరిధిలోని అన్ని క్వారీలు, కంపెనీలు, మైనింగ్‌ అధికారులకు అందజేయాలని కమిషనర్‌ ఆదేశించారు.

Updated Date - Jun 27 , 2026 | 06:39 AM