Share News

1.. 2.. 3.. అంటే ఏసీబీ

ABN , Publish Date - Jun 08 , 2026 | 06:31 AM

రవాణా శాఖ కార్యాలయాల్లో 1.. 2.. 3.., 1.. 2.. 3.. అని వినపడితే అది మైక్‌ టెస్టింగ్‌ అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ‘‘1..2..3 అంటే ఏసీబీ’’! ఇది రవాణా శాఖ కార్యాలయాల్లో పెట్టుకున్న కోడ్‌..

1.. 2.. 3.. అంటే ఏసీబీ

  • గీతలు, చుక్కలు, పిన్నులు, కారు నెంబర్లు.. రవాణా శాఖ కార్యాలయాల్లో ప్రతీది కోడే

  • కమిషనర్‌ వచ్చే సమయానికి కోడ్‌ సిగ్నల్‌

  • దాంతో అంతా గప్‌చుప్‌.. దళారులు గాయబ్‌

  • అడిగినంత ఇస్తే మనిషి లేకుండానే డ్రైవింగ్‌ లైసెన్సు

  • స్టీరింగ్‌ పట్టుకుని కూర్చుంటే ట్రాక్‌పై టెస్ట్‌ పూర్తి

  • రవాణా శాఖలో అవినీతి ఆరోపణలపై సీఎంవో ఆరా

హైదరాబాద్‌, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి): రవాణా శాఖ కార్యాలయాల్లో 1.. 2.. 3.., 1.. 2.. 3.. అని వినపడితే అది మైక్‌ టెస్టింగ్‌ అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ‘‘1..2..3 అంటే ఏసీబీ’’! ఇది రవాణా శాఖ కార్యాలయాల్లో పెట్టుకున్న కోడ్‌ (సంకేతం).ఏసీబీ అధికారులు, ఏసీబీ తనిఖీలు.. ఇలాంటి అంశాల గురించి ఏ ఇద్దరు అధికారులు, సిబ్బంది మాట్లాడుకోవాలన్నా ఈ కోడ్‌నే ఉపయోగిస్తారు. ఇదొక్కటే కాదు.. దరఖాస్తు పత్రాలపై కనిపించే నిలువు గీతలు.. అడ్డు గీతలు.. స్టాప్‌లర్‌ పిన్నులు.. వాహనం నెంబరు... ఇలా చాలా అంశాలను సంకేతాలుగా వినియోగిస్తున్నారు. రవాణా శాఖ కార్యాలయాల్లో ప్రైవేటు వ్యక్తులు, దళారుల్ని అనుమతించేది లేదని కమిషనర్‌ గతంలో ఆదేశాలు జారీ చేసినా పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. తాజాగా పలు రవాణా శాఖ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో ప్రైవేటు వ్యక్తులు, వారి వ్యవహారాలు బహిర్గత కావడమే ఇందుకు నిదర్శనం. ఎక్కడో దూరంగా కాదు ఏకంగా రవాణా శాఖ కమిషనర్‌ కార్యాలయ ప్రాంగణంలో కొనసాగుతున్న ఖైరతాబాద్‌ రవాణా శాఖ కార్యాలయంలోనూ దళారుల ఆగడాలు ఆగడం లేదు. కమిషనర్‌ వచ్చి, వెళ్లే సమయంలో దళారుల వ్యవహారాలు ఆయన కంట పడకుండా ఉండేందుకు కూడా ప్రత్యేక కోడ్‌ను ఉపయోగిస్తున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. కోడ్‌ సిగ్నల్‌ రాగానే.. అప్పటి వరకూ అక్కడ ఉండే దళారులు ఒక్కసారిగా పక్కకు తప్పుకుంటున్నారు.


సార్‌ వెళ్లగానే షరా మామూలే. పైకి అంతా ఆన్‌లైనే అని చెబుతున్నప్పటికీ.. రవాణా శాఖ కార్యాలయాల్లో దళారుల ప్రమేయం లేకుండా నేరుగా వెళ్లి ఏ పనీ చేసుకోలేని పరిస్థితి ఉందంటే అతిశయోక్తి కాదు. దళారులకు అడిగినంత ముట్టజెపితే మనిషి లేకుండానే డ్రైవింగ్‌ లైసెన్సులు చేతికి వస్తున్న పరిస్థితి. అంతే కాదు.. టెస్ట్‌ ట్రాక్‌లో ఎలాంటి ఇబ్బందులూ లేకుండా కారులో పక్క సీటులో కూర్చుని మరీ వ్యవహారం చక్కబెడతారు. నిబంధనల ప్రకారం టెస్ట్‌ డ్రైవ్‌ సమయంలో వాహనంలో రెండో వ్యక్తి ఉండకూడదు. కానీ అధికారులతో మిలాఖత్‌ అయ్యే ఏజెంట్‌ అంతా తానై వ్యవహరిస్తాడు. తాజాగా ఏసీబీ అధికారుల తనిఖీల్లోనూ ఈ గుట్టు బయటపడింది. డ్రైవింగ్‌ లైసెన్సు, ఆర్‌సీ, ఫిట్‌నెస్‌, వాహనం బదిలీ, లైసెన్సు రెన్యువల్‌... ఇలా ఒక్కో పనికీ ఒక్కో రేట్‌ నిర్ణయించి వసూలు చేస్తున్నారు. ఇందులో హోంగార్డు నుంచి అధికారుల వరకూ ఎవరి వాటా వారికి అందుతుంది. హోంగార్డులు, అధికారుల వద్ద పనిచేసే ప్రైవేటు డ్రైవర్లే.. నగదును చేతులు మార్చడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంపైనా ఏసీబీ దృష్టి సారించింది. కాగా రవాణా శాఖలో అవినీతిపై ఇటీవల వరుసగా వస్తున్న ఆరోపణలపై ముఖ్యమంత్రి కార్యాలయం సంబంధిత అధికారుల్ని ఆరా తీసినట్లు సమాచారం.


విజిలెన్స్‌ నిఘా...

అవినీతి ఆరోపణలు, సీఎంవో ఆరా, ఏసీబీ ఆకస్మిక తనిఖీల నేపథ్యంలో రవాణా శాఖలోని విజిలెన్స్‌ విభాగం రంగంలోకి దిగింది. ప్రైవేటు వ్యక్తుల కదలికలు లేకుండా చూడాలని అన్ని రవాణా శాఖ కార్యాలయాలకూ మరోసారి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసేందుకు సిద్ధమైంది. రవాణా శాఖ అధికారులపై హైదరాబాద్‌తోపాటు, శివారు ప్రాంతాలు, కొన్ని జిల్లాల్లో విజిలెన్స్‌ విభాగానికి ఇప్పటికే ఫిర్యాదులు అందాయి. కొందరు మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్ల పనితీరు. అవినీతికి సంబంధించి విజిలెన్స్‌ విభాగం సమాచారం సేకరించింది. అలాంటి వారందరిపైనా ప్రత్యేకంగా దృష్టి సారించి పరిస్థితి చక్కదిద్దే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ‘రవాణా శాఖ కార్యాలయాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ దళారుల్ని అనుమతించేది లేదు. ఇందుకు సంబంధించి ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాం. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మరోసారి ఆదేశాలు పంపిస్తాం. ఎట్టి పరిస్థితుల్లోనూ అవినీతిని సహించేది లేదు. బాధ్యుతలపై శాఖపరమైన చర్యలు తప్పవు.’’ అని ఉన్నతాధికారులు వెల్లడించారు.

Updated Date - Jun 08 , 2026 | 06:31 AM