గురుకులంలో క్షుద్రపూజలు?
ABN , Publish Date - Feb 24 , 2026 | 05:32 AM
జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో క్షుద్రపూజల ఘటన కలకలం రేపింది. పాఠశాల వసతి గృహంలో వార్డెన్ మల్లీశ్వరి, మరికొందరు కలిసి తీవ్ర అనుమానాస్పదంగా....
ట్రాన్స్‌జెండర్లను పిలిపించి వార్డెన్, సిబ్బంది పూజలు
గూడూరు గిరిజన బాలికల పాఠశాలలో ఘటన
బాధిత పిల్లలు రోడ్డెక్కినా పట్టదా?: హరీశ్
పాలకుర్తి, హైదరాబాద్, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో క్షుద్రపూజల ఘటన కలకలం రేపింది. పాఠశాల వసతి గృహంలో వార్డెన్ మల్లీశ్వరి, మరికొందరు కలిసి తీవ్ర అనుమానాస్పదంగా ప్రవర్తించారని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. ఆదివారం తమను గదుల్లోకి వెళ్లాలని, పెద్దసార్లు వస్తున్నారని, ఎవ్వరూ బయటకు రావొద్దని హెచ్చరించారని విద్యార్థినులు చెప్పారు. అదేరోజు వార్డెన్, సిబ్బంది కలిసి రాత్రి ఇద్దరు ట్రాన్స్‌జెండర్లను తీసుకొచ్చారని తెలిపారు. పసుసు, కుంకుమతో పూజలు నిర్వహించి, నిమ్మకాయలు, గుమ్మడికాయ కొట్టారని, నీటిలో పసుసు, కుంకుమ కలిపి మంత్రాలు చదువుతూ ఆ ద్రావణాన్ని తరగతి గదుల్లో, తమపై చల్లారని వివరించారు. దీంతో తాము తీవ్ర భయాందోళనకు గురయ్యామని చెప్పారు. కాగా ఈ ఘటనపై సోమవారం గూడూరు ప్రధాన రహదారిపై విద్యార్థినులు ఆందోళన చేపట్టారు. అక్కడికి పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి చేరుకోగా బాధిత విద్యార్థినులు ఘటనను ఆమె దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను యశస్విరెడ్డి కోరారు. ఈ ఘటనపై గ్రామస్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలల్లో క్షుద్రపూజలు ఏమిటని మండిపడుతున్నారు. ఈ క్షుద్ర పూజలు ఎందుకు చేశారు? దీని వెనకెవరున్నారన్నది తెలియాల్సి ఉంది. ప్రిన్సిపల్ రేణుక సోమవారం సెలవులో ఉండటంతో వార్డెన్‌ను సంప్రదించే ప్రయత్నం చేయగా ఆమె అందుబాటులోకి రాలేదు.
పిల్లలకు టైమ్‌కు అన్నం పెట్టరా?: హరీశ్
గూడూరు బాలికల గురుకులంలో పాఠాలు చెప్పడానికి ఉపాధ్యాయులు లేరని, సమయానికి పెట్టడానికి అన్నం లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు ‘ఎక్స్’ వేదికగా ధ్వజమెత్తారు. బడిలో క్షుద్ర పూజలు జరుగుతున్నాయంటూ విద్యార్థినులు భయంతో వణికిపోతూ.. రోడ్డెక్కి ధర్నాచేసే పరిస్థితి వచ్చిందన్నారు. దీన్ని బట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతలా భ్రష్ఠుపట్టిందో అర్థమవుతోందని విమర్శించారు.