Share News

తాగిన మత్తులో రాశానేమో?

ABN , Publish Date - Jul 22 , 2026 | 05:45 AM

జాతీయ పోలీసు అకాడమీలో లైంగిక వేధింపుల ఆరోపణల వ్యవహారం మరిన్ని మలుపులు తిరుగుతోంది. వేధింపుల కేసు నేపథ్యంలో.. ఆత్మహత్యాయత్నం చేసినట్టు..

తాగిన మత్తులో రాశానేమో?

  • సూసైడ్‌ నోట్‌పై వైద్యులతో చెప్పిన ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి

  • ఆమె, నేను ప్రేమించుకున్నాం.. చాలా కాలం సన్నిహితంగా మెలిగాం

  • ఆమెకు పెళ్లైనా, నాపై ఇష్టం ఉందంటూ వచ్చింది.. కాదన్నందుకు కక్షతోనే తప్పుడు ఆరోపణలు

  • పోలీసులు సరిగ్గా పరిశీలించకుండానే ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేశారు.. దాన్ని కొట్టివేయండి

  • హైకోర్టును ఆశ్రయించిన ఉదయ్‌ కృష్ణారెడ్డి

  • అతిగా మద్యం తాగడంతోనే అపస్మారక స్థితిలోకి.. ఉదయ్‌ శరీరంలో విషపదార్థాల్లేవు: వైద్యులు

హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ, జూలై 21 (ఆంధ్రజ్యోతి): జాతీయ పోలీసు అకాడమీలో లైంగిక వేధింపుల ఆరోపణల వ్యవహారం మరిన్ని మలుపులు తిరుగుతోంది. వేధింపుల కేసు నేపథ్యంలో.. ఆత్మహత్యాయత్నం చేసినట్టు ప్రచారం జరిగిన ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి శరీరంలో ఎలాంటి విషపదార్థాల జాడ లేదని వైద్యులు తెలిపారు. రక్తపరీక్షల్లో ఆల్కాహాల్‌ మాత్రమే గుర్తించామని, ఆయన ఆహారం తీసుకోకుండా అతిగా మద్యం తాగడం వల్లే స్పృహకోల్పోయి ఉంటారని నిర్ధారణకు వచ్చామని చెప్పారు. జయంతి ఆస్పత్రి వైద్యుడు రవిశంకర్‌రెడ్డి మంగళవారం మధ్యాహ్నం ఈ వివరాలు వెల్లడించారు. ఉదయ్‌ కృష్ణారెడ్డి స్పృహలోకి వచ్చారని, ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందన్నారు. ఉదయ్‌ కృష్ణారెడ్డితో మాట్లాడామన్నారు. ఆయన ఎలాంటి ఆత్మహత్యాయత్నం చేయలేదని, సూసైడ్‌ నోట్‌ రాసినట్టు తనకు గుర్తులేదని, మద్యం మత్తులో రాసి ఉండవచ్చేమోనని చెబుతున్నారని వివరించారు.


నాపై కేసును కొట్టివేయండి..

ఫిర్యాదు చేసిన ట్రైనీ మహిళా ఐపీఎస్‌, తాను చాలా రోజుల నుంచి ప్రేమించుకుంటున్నామని.. తమ మధ్య ఉన్న సన్నిహిత సంబంధం విషయంలో ఇబ్బందులతోనే ఆమె తప్పుడు ఆరోపణలు చేశారంటూ ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి హైకోర్టులో పిటిషన్‌ వేశారు. పోలీసులు ప్రాథమిక పరిశీలన ఏదీ చేయకుండానే ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేశారని, దానిని కొట్టివేయాలని అభ్యర్థించారు. ఇక ఉదయ్‌ కృష్ణారెడ్డి ఎలాంటి ఆత్మహత్యాయత్నం చేయలేదని.. అతిగా మద్యం తాగడంతోనే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారని వెల్లడైంది. అంతేకాదు.. తాను మద్యం మత్తులో సూసైడ్‌ నోట్‌ రాసి ఉండొచ్చని ఉదయ్‌ చెబుతున్నారని ఆయన చికిత్స పొందుతున్న ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ఇక పరస్పర ఆరోపణల నేపథ్యంలో ఉదయ్‌ కృష్ణారెడ్డి ఫోన్‌ను పరిశీలిస్తే.. అసలు సంగతి బయటపడుతుందని పోలీసు అధికారులు చెబుతున్నారు.


మేం పెళ్లి చేసుకుందామనుకున్నాం!

ట్రైనీ మహిళా ఐపీఎస్‌ను లైంగికంగా వేధించిన ఆరోపణలతో తనపై అత్తాపూర్‌ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ ఉదయ్‌ కృష్ణారెడ్డి మంగళవారం హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ‘‘ఫిర్యాదు చేసిన ట్రైనీ మహిళా ఐపీఎస్‌, నేను ముస్సోరిలో శిక్షణ సమయంలో ఒకరికొకరు ప్రేమించుకున్నాం. మానసికంగా, శారీరకంగా సన్నిహితంగా మెలిగాం. పోలీస్‌ అకాడమీలో సైతం ఇది కొనసాగింది. సర్వీసులో చేరాక వివాహం చేసుకోవాలనుకున్నాం. కాబోయే భార్య అనే విశ్వాసంతో ఆమెకు ఆర్థికంగా చాలా సహాయం చేశాను. కానీ నాకు మరో మహిళతో సంబంధమున్నట్టు ఆమె అనుమానం పెంచుకుంది. ఈ క్రమంలో ఈ ఏడాది మేలో ఒక ఐఏఎస్‌ అధికారిని వివాహం చేసుకుంది. తర్వాత నాకు మరే మహిళతో సంబంధం లేదనే విషయం అర్థమైందంటూ, నేనంటే ఇప్పటికీ ఇష్టమంటూ పోలీస్‌ అకాడమీలో నా గదికి వచ్చింది. కానీ ఆమెకు వివాహం కావడంతో నేను తిరస్కరించాను. వేరే అమ్మాయిని పెళ్లిచేసుకుంటానని చెప్పాను. అయినా ఆమె తరచూ ఫోన్‌ చేస్తూ, నా గదికి వస్తూ ఉండేది. ఈ విషయం ఆమె భర్తకు తెలియడంతో నిలదీశారు. దీనితో నేనే ఆమెను వేధిస్తున్నట్టు భర్తకు చెప్పింది. ఆమె భర్త నాకు ఫోన్‌ చేసి అడగడంతో.. మా అనుబంధం గురించి వివరించాను. కానీ ఆయన నాదే తప్పు అని వాదించడంతో.. నిజాయతీ నిరూపించుకునేందుకు ఆమె, నేను కలిసి ఉన్న ఒక వీడియోను పంపాను. అది చూసి ఆమె భర్త గొడవ పెట్టుకున్నారు. ఆమె నాపై ప్రతీకారంతో పోలీస్‌ అకాడమీ డైరెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. తర్వాత తప్పుడు ఆరోపణలతో పోలీసులకు ఫిర్యాదు చేసింది’’ అని పిటిషన్‌లో ఉదయ్‌ కృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు తన వద్ద ఉన్న అన్ని ఆధారాలు, వీడియోలు కోర్టుకు సమర్పిస్తున్నానని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ త్వరలో హైకోర్టు ఎదుట విచారణకు రానుంది.


వారి ఫోన్లలోనే గుట్టు!

తనకు అసభ్య సందేశాలు పంపుతూ, లైంగికంగా వేధించారని ట్రైనీ మహిళా ఐపీఎస్‌ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఉదయ్‌ కృష్ణారెడ్డి ఐఫోన్‌ను, బాధితురాలి ఫోన్‌ను పరిశీలిస్తే.. వ్యవహారం ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఉదయ్‌ కృష్ణారెడ్డి ఆస్పత్రిలో ఉండటంతో ఆయన ఫోన్‌ ఎక్కడుందనేది తెలియలేదని అంటున్నాయి.

Updated Date - Jul 22 , 2026 | 05:48 AM