Share News

Tragic Losses Strike: కన్నీళ్లకే కన్నీరొచ్చె..

ABN , Publish Date - Jan 02 , 2026 | 04:54 AM

అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేసిన నాన్న మరణానికి తల్లడిల్లిపోయిన కుమార్తె గుండె.. దశదిన కర్మ రోజు తండ్రి చిత్రపటం వద్ద రోదిస్తుండగా ఆగిపోయింది.

Tragic Losses Strike: కన్నీళ్లకే కన్నీరొచ్చె..

  • నాన్న దశదిన కర్మ.. తండ్రి పటం వద్ద రోదిస్తుండగా ఆగిన కుమార్తె గుండె

  • అనారోగ్యంతో భర్త.. సమాధి వద్ద ఏడుస్తూ భార్య ..

  • ఒకే రోజు ఇంట్లో నాన్న, ఆస్పత్రిలో కుమారుడు మృతి

  • అంతులేని విషాదాన్ని మిగిల్చిన ఘటనలు

మాడ్గులపల్లి, రామగిరి, కోటగిరి, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేసిన నాన్న మరణానికి తల్లడిల్లిపోయిన కుమార్తె గుండె.. దశదిన కర్మ రోజు తండ్రి చిత్రపటం వద్ద రోదిస్తుండగా ఆగిపోయింది. దాదాపు 50 ఏళ్లు తనతో జీవితాన్ని పంచుకున్న భర్త మరణాన్ని జీర్ణించుకోలేకపోయిన భార్య.. తన జీవిత భాగస్వామి సమాధి వద్దే ఏడుస్తూ ప్రాణాలు విడిచింది. అనారోగ్యంతో ఇంట్లో మంచం పట్టిన తండ్రి.. గుండెపోటుతో ఆస్పత్రిపాలైన కొడుకు.. ఒకే రోజున తనువు చాలించారు. రాష్ట్రంలోని మూడు వేర్వేరు కుటుంబాల్లో గురువారం అంతులేని విషాదం నింపిన ఘటనలివి. నల్లగొండ జిల్లా మాడ్గులపల్లికి చెందిన సోమయ్య(78) వ్యవసాయ కూలీ. తన ఐదుగురు కుమార్తెలకు వివాహాలు చేశారు. మూడో కుమార్తె కోడూరి రమణమ్మ(35) భర్త మరణించగా తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. అనారోగ్యంతో సోమయ్య మరణించగా గురువారం దశదినకర్మ నిర్వహించారు. రమణమ్మ తండ్రి చిత్రపటాన్ని పట్టుకొని రోదిస్తూ కుప్పకూలిపోయింది. ఇక, నిజామాబాద్‌ జిల్లా కోటగిరి మండలం యాద్గార్‌పూర్‌కు చెందిన గుండ్ల సాయిలు(70), లచ్చవ్వ(68) దంపతులకు ఐదుగురు సంతానం. నెల రోజుల క్రితం అస్వస్థతకు గురైన సాయిలు మంగళవారం చనిపోగా బుధవారం అంత్యక్రియలు నిర్వహించారు. కుటుంబ సభ్యులతో కలిసి గురువారం ఉదయం భర్త సమాధి వద్దకు వెళ్లినలచ్చవ్వ.. రోదిస్తూ అక్కడే ప్రాణాలు వదిలింది. ఇక, పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని నాగేపల్లికి చెందిన ఎరుకల రాజేశం(55), ఆయన రెండో కొడుకు ఎరుకల శ్రీకాంత్‌(29) గతంలో సింగరేణికి అనుబంధంగా ఉండే ఎక్స్‌ప్లోజివ్‌ కంపెనీలో పని చేసేవారు. కంపెనీ మూతపడడంతో ఉపాధి కోల్పోయారు. శ్రీకాంత్‌ భవన నిర్మాణకూలీగా పనిచేస్తూ తండ్రి, భార్య, ఇద్దరు బిడ్డలను పోషించుకుంటున్నాడు. పక్షవాతానికి గురైన తండ్రి రాజేశం కొంతకాలంగా ఇంటికే పరిమితమయ్యారు. అయితే శ్రీకాంత్‌ బుధవారం రాత్రి గుండెపోటుతో ఆస్పత్రిలో చేరాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శ్రీకాంత్‌ గురువారం కన్నుమూశాడు. అదే సమయంలో తండ్రి రాజేశం కూడా ఆరోగ్యం మరింత క్షీణించి ప్రాణాలు వదిలారు. తండ్రి, కొడుకు ఒకే రోజు మరణించడంతో వారి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

Updated Date - Jan 02 , 2026 | 04:54 AM