Share News

పరీక్షల్లో ఫెయిల్‌ అయ్యామని ఆరుగురి ఆత్మహత్య

ABN , Publish Date - Apr 13 , 2026 | 05:50 AM

ఇంటర్‌ పరీక్షల్లో ఫెయిల్‌ అయ్యామనే మనస్తాపంతో రాష్ట్రంలో పలువురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆదివారం ఇంటర్మీడియట్‌ బోర్డు ఫలితాలు విడుదలవగా కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్‌ అయినట్లు గుర్తించిన ఐదుగురు విద్యార్థులు ఉరివేసుకుని ఆత్మహత్యలు ....

పరీక్షల్లో ఫెయిల్‌ అయ్యామని ఆరుగురి ఆత్మహత్య

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

ఇంటర్‌ పరీక్షల్లో ఫెయిల్‌ అయ్యామనే మనస్తాపంతో రాష్ట్రంలో పలువురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆదివారం ఇంటర్మీడియట్‌ బోర్డు ఫలితాలు విడుదలవగా కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్‌ అయినట్లు గుర్తించిన ఐదుగురు విద్యార్థులు ఉరివేసుకుని ఆత్మహత్యలు చేసుకున్నారు. మరో విద్యార్థి ఫలితాలకు రెండ్రోజుల ముందే రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మెదక్‌, సూర్యాపేట, ఆదిలాబాద్‌, మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌, ఖమ్మం జిల్లాల్లో ఈ విషాదాలు చోటుచేసుకున్నాయి. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ (సీఈసీ) మొదటి సంవత్సరం చదువుతున్న మెదక్‌ జిల్లా వెల్దుర్తి మండలం మంగళపర్తి గ్రామానికి చాకలి సాయిరాం (16) రెండు సబ్జెక్ట్‌ల్లో ఫెయిల్‌ అయ్యాననే మనస్తాపంతో ఇంట్లో ఉరి వేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు తలుపులు విరగ్గొట్టి లోపలికి వెళ్లి చూడగా, అప్పటికే మృతిచెందాడు. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం బండమీది చందుపట్ల గ్రామానికి చెందిన యడ్ల సౌజన్య (16) మునగాల గురుకుల కళాశాలలో ఇంటర్‌ (బైపీసీ) మొదటి సంవత్సరం చదువుతోంది. జువాలజీ సబ్జెక్టులో ఫెయిల్‌ అవ్వడంతో ఇంటి బాత్‌రూంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌ పట్టణంలో పూలాజిబాబా జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం చదువుతున్న దంతనపల్లి గ్రామానికి చెందిన జూలపల్లి సౌజన్య (17) రెండు సబ్జెక్టుల్లో ఫేయిల్‌ కావడంతో ఆవేదనకు గురై ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్‌లోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ (సీఈసీ) ద్వితీయ సంవత్సరం చదువుతున్న భూత్పూర్‌ మండలంలోని అన్నాసాగర్‌ గ్రామానికి చెందిన జక్కుల శ్రావణి రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్‌ అవ్వడంతో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇక, హైదరాబాద్‌లోని వారాసిగూడకు చెందిన కోయడ కల్యాణి బేగం (16) మారేడుపల్లిలోని ప్రభుత్వ గర్ల్స్‌ జూనియర్‌ కాలేజీలో ఇంటర్‌ (ఎంపీసీ) మొదటి సంవత్సరం చదువుతోంది. నాలుగు సబ్బెక్టుల్లో ఫెయిల్‌ అయ్యాననే మనస్తాపంతో చున్నీతో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గాంధీ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఆత్మహత్యకు ముందు సోదరుడి మొబైల్‌కు ’గుడ్‌బై అండ్‌ డోంట్‌ చెక్‌ మై ఇంటర్‌ రిజల్ట్‌’ అని మెసేజ్‌ పంపింది. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఫలితాల భయంతో ఆత్మహత్య.. కానీ పాస్‌

పరీక్షల్లో ఫెయిల్‌ అవుతానన్న భయంతో రెండు రోజుల క్రితం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఖమ్మం జిల్లా బోనకల్‌ మండలం రాపల్లి గ్రామానికి చెందిన గంగదేవుల అక్షంత్‌ (17) ఇంటర్‌ ప్రథమ సంవత్సరం ఎంపీసీ విభాగంలో 347 మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. ఆన్‌లైన్‌లో తమ కుమారుడి మార్కుల వివరాలు చూసిన వారి తల్లిదండ్రులు బోరున విలపించారు. చేతికందిన కుమారుడు అనుకోని విధంగా ఆత్మహత్య చేసుకోవడం వారిని తీవ్రంగా కలచివేసింది.

Updated Date - Apr 13 , 2026 | 05:50 AM