Share News

తల్లికి తలకొరివి పెట్టిన కూతుళ్లు

ABN , Publish Date - Feb 23 , 2026 | 01:59 AM

భర్త చనిపోయిన నెల రోజులకే ఓ వ్యవసాయ కూలీ గుండెపోటుతో మృతి చెందింది. వారి కూతుర్లే అన్ని తామై అంత్యక్రియలు నిర్వహించి తలకొరివి పెట్టారు...

తల్లికి తలకొరివి పెట్టిన కూతుళ్లు

  • గుండెపోటుతో పొలంలో వ్యవసాయ కూలీ మృతి

  • నెల రోజుల వ్యవధిలో తల్లిదండ్రుల మృత్యువాత

కోనరావుపేట, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): భర్త చనిపోయిన నెల రోజులకే ఓ వ్యవసాయ కూలీ గుండెపోటుతో మృతి చెందింది. వారి కూతుర్లే అన్ని తామై అంత్యక్రియలు నిర్వహించి తలకొరివి పెట్టారు. ఈ విషాద ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో ఆదివారం జరిగింది. సుద్దాల గ్రామానికి చెందిన నిరుపేద వ్యవసాయ కూలీ ఎగదండి నర్సవ్వ (55) శనివారం పొలంలో పనిచేస్తూ గుండెపోటుతో అక్కడిక్కడే మృతి చెందింది. ఆటో డ్రైవర్‌గా పనిచేసిన ఆమె భర్త ఎగదండి బాబు నెలరోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందాడు. వీరికి నలుగురు కూతుళ్లు మమత, స్వప్న, శ్వేత, సింధుజ ఉన్నారు. భర్త మరణం తట్టుకోలేక కూతుళ్లను చూసి ఆమె మనోవేదనకు గురయ్యేది. ఈక్రమంలో వ్యవసాయ పనులకు వెళ్లి గుండెపోటుతో మృతి చెందింది. నెలరోజుల వ్యవధిలోనే తల్లిదండ్రులు మృతి చెందడంతో కూతుళ్లు కన్నీరుమున్నీరుగా విలపించారు. తల్లి పాడెను కూతుళ్లే మోసి చితికి నిప్పు పెట్టారు. ఈ సంఘటన పలువురుని కంటతడి పెట్టించింది.

Updated Date - Feb 23 , 2026 | 01:59 AM