Tragic Incidents: నూతన సంవత్సరం వేళ విషాదాలు
ABN , Publish Date - Jan 02 , 2026 | 04:28 AM
నూతన సంవత్సర వేడుకలు ఆ కుటుంబాల్లో విషాదం నింపాయి. వేర్వేరుచోట్ల చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు యువకులు, ఓ బాలుడు ....
వేడుకలకు వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురి మృతి
కేక్ కొనేందుకు వెళ్లి బైక్ ఢీకొని బాలుడి మృతి
ఓ యువకుడిని పుట్టినరోజునే కబళించిన మృత్యువు
సోమశిల వద్ద కృష్ణా నదిలో యువకుడి గల్లంతు
హైదరాబాద్‌లో పార్టీలో కలుషిత ఆహారంతో ఒకరి మృతి
14 మందికి అస్వస్థత, ఇద్దరి పరిస్థితి విషమం
రఘునాథపల్లి/కామారెడ్డిటౌన్/మాక్లూర్/లింగాలఘణపురం/కొల్లాపూర్/జీడిమెట్ల, జనవరి 1(ఆంధ్రజ్యోతి): నూతన సంవత్సర వేడుకలు ఆ కుటుంబాల్లో విషాదం నింపాయి. వేర్వేరుచోట్ల చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు యువకులు, ఓ బాలుడు మరణించారు. పార్టీలో ఆహారం కలుషితమై ఓ వ్యక్తి మరణించగా, 14 మంది అస్వస్థతకు గురయ్యారు. మరో యువకుడు కృష్ణా నదిలో గల్లంతయ్యాడు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం శ్రీమన్నారాయణపురానికి చెందిన పరికిబండ రాజ్‌కుమార్(14) బుధవారం రాత్రి కేక్ కొనేందుకు నిడిగొండ వెళ్లి వస్తుండగా బుల్లెట్ మోటారు సైకిల్ అతివేగంగా వచ్చి రాజ్‌కుమార్‌ను ఢీ కొట్టింది. తీవ్రంగా గాయపడిన రాజ్‌కుమార్‌ను హైదరాబాద్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. కామారెడ్డికి చెందిన గోపు నరేశ్ (32) నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొని గురువారం తెల్లవారుజామున తిరిగి ఇంటికి వెళ్తుండగా కలెక్టరేట్ సమీపంలో అతని కారు బోల్తా పడడంతో నరేశ్ మృతిచెందాడు. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం కౌల్‌పూర్‌కు చెందిన అన్నదమ్ములు చల్లా వెంకటేష్, వాసు(21) వేడుకలు జరుపుకోవడానికి బుధవారం రాత్రి బోధన్ వెళ్తుండగా గొట్టుముక్కుల శివారులో బైక్ అదుపు తప్పింది. తీవ్ర గాయాలతో వాసు చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం గుమ్మడవెల్లికి చెందిన దడిగే రవికుమార్ (21) బుధవారం రాత్రి స్నేహితులతో కలిసి నూతన సంవత్సర, తన జన్మదిన వేడుకలను జరుపుకున్నాడు. అనంతరం మినీ ట్రక్కులో ఎస్సీ కాలనీ నుంచి గుమ్మడవెల్లికి వెళ్తుండగా వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టి పల్టీ కొట్టింది. తీవ్రంగా గాయపడిన రవికుమార్ దుర్మరణం పాలయ్యాడు. మిగతా వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. హైదరాబాద్‌లో పనిచేస్తున్న కర్నూల్ జిల్లాకు చెందిన బింగిని అశోక్ (32) ఐదుగురు స్నేహితులతో కలిసి నూతన సంవత్సరం వేడుకల కోసం బుధవారం రాత్రి నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల ప్రాంతానికి వచ్చాడు. వేడుకల తర్వాత అశోక్.. జాలర్ల పుట్టి వేసుకొని కృష్ణా నదిలోకి వెళ్లి గల్లంతయ్యాడు. హైదరాబాద్ కుత్బుల్లాపూర్ పరిధిలోని భవానీ నగర్‌లో జరిగిన కాలనీవాసుల పార్టీలో ఆహారం కలుషితమై వెలగల పాండు అనే వ్యక్తి మృతిచెందాడు. మరో 14మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.