Share News

చాక్లెట్లు ఇప్పిస్తానని తీసుకెళ్లి.. కన్నకొడుకులకు ఉరేసి చంపి ఆత్మహత్య చేసుకున్న తండ్రి

ABN , Publish Date - Apr 29 , 2026 | 06:32 AM

ఆలుమగల మధ్య కలహాలు దారుణానికి కారణమయ్యాయి. భర్తను వదిలేసి పిల్లలను తీసుకొని భార్య పుట్టింటికి వెళ్లిపోగా.. ఆపై కోపమో..! మరేదైనా కారణమో ! స్పష్టత లేదు కానీ..

చాక్లెట్లు ఇప్పిస్తానని తీసుకెళ్లి.. కన్నకొడుకులకు ఉరేసి చంపి ఆత్మహత్య చేసుకున్న తండ్రి

  • మహబూబాబాద్‌ జిల్లాలో దారుణం

  • భార్యాభర్తల మధ్య కలహాలే కారణం!

తొర్రూరు, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి): ఆలుమగల మధ్య కలహాలు దారుణానికి కారణమయ్యాయి. భర్తను వదిలేసి పిల్లలను తీసుకొని భార్య పుట్టింటికి వెళ్లిపోగా.. ఆపై కోపమో..! మరేదైనా కారణమో ! స్పష్టత లేదు కానీ.. చాక్లెట్లు ఇప్పిస్తానంటూ తన ఇద్దరు కొడుకులను వెంట తీసుకెళ్లిన తండ్రి.. ఆ చిన్నారులకు ఉరి వేసి చంపి.. ఆపై తాను ఆత్మహత్య చేసుకున్నాడు. మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరులో మంగళవారం ఉదయం వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తొర్రూరు మండలంలోని అమ్మాపురం గ్రామానికి చెందిన కిన్నెర గుంషావళి (35), కాంత దంపతులకు కూతురు విన్యా, కుమారులు విలాస్‌ (7), నికేష్‌(3) ఉన్నారు. గుంషావళి మెకానిక్‌గా పని చేస్తుండగా కాంత కూలీ పనులకు వెళుతుంటోంది. అయితే, మద్యానికి బానిసైన గుంషావళి ఇటీవల పనికి వెళ్లడం మానేశాడు. పద్ధతి మార్చుకోవాలని కుటుంబసభ్యులు హెచ్చరించినా పట్టించుకోలేదు. దీంతో దంపతుల మధ్య కొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కాంత 15 రోజుల క్రితం పిల్లలు ముగ్గురిని తీసుకొని అదే గ్రామంలోని తమ పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే, ఏం జరిగిందో ఏమో కానీ సోమవారం ఉదయం అత్తగారింటికి వెళ్లిన గుంషావళి.. ఆ ఇంటి ఆరుబయట ఆడుకుంటున్న తన కొడుకులు విలాస్‌, నికేష్‌ను చాక్లెట్లు ఇప్పిస్తానంటూ తనతోపాటు తీసుకెళ్లాడు. కూతురు విన్యాను వెంటబెట్టుకొని పనికి వెళ్లిన కాంత ఇంటికి తిరిగొచ్చాక విషయం తెలుసుకొని ఆందోళనకు గురైంది. భర్త, కొడుకుల కోసం గాలించినా ఫలితం లేకపోయింది. అయితే, తొర్రూరు శివారులోని వ్యవసాయ మార్కెట్‌ యార్డు సమీపంలోని ఓ వేపచెట్టుకు తన పిల్లలకు ఉరివేసిన గుంషావళి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం ఉదయం స్థానికులు ఈ దారుణాన్ని గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Updated Date - Apr 29 , 2026 | 06:34 AM