చిన్నారులకు జన్మనిచ్చిన..కొద్దిరోజులకే లోకం వీడిన తల్లులు
ABN , Publish Date - May 24 , 2026 | 05:13 AM
ముక్కుపచ్చలారని చిన్నారులను అక్కున చేర్చుకుని ముద్దాడాల్సిన ఇద్దరు తల్లులు కన్నుమూశారు. ప్రసవించి నెల రోజులు కూడా నిండకముందే గంటల ...
గంటల వ్యవధిలో ఇద్దరు బాలింతల మృతి
చేగుంట, మే 23 (ఆంధ్రజ్యోతి): ముక్కుపచ్చలారని చిన్నారులను అక్కున చేర్చుకుని ముద్దాడాల్సిన ఇద్దరు తల్లులు కన్నుమూశారు. ప్రసవించి నెల రోజులు కూడా నిండకముందే గంటల వ్యవధిలో వదిన, మరదలు చనిపోయారు. మెదక్ జిల్లా చేగుంట మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన కరసాని స్వాతి(26), దండు సౌందర్య(27) వరుసకు వదిన, మరదళ్లు. వీరిద్దరూ దాదాపు ఒకే సమయంలో గర్భం దాల్చి, ఇటీవలే పసిబిడ్డలకు జన్మనిచ్చారు. స్వాతి ప్రసవం కోసం తన పుట్టింటికి చిన్న శంకరంపేట మండలం చందంపేటకు వెళ్లింది. ఇటీవల ఓ బిడ్డకు జన్మనిచ్చింది. శుక్రవారం రాత్రి ఆమె అకస్మాత్తుగా అస్వస్థతకు గురికావడంతో, కుటుంబ సభ్యులు హుటాహుటిన మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయం తెలిసిన సౌందర్య.. వదిన మరణాన్ని జీర్ణించుకోలేకపోయింది. తన పసిబిడ్డను పక్కన పడుకోబెట్టుకుని ఉండగానే ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురైంది. వెంటనే సౌందర్యను నర్సాపూర్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మరణించింది. రోజుల వ్యవధిలోనే బిడ్డలకు ప్రాణం పోసిన ఆ తల్లులు ఇలా అకస్మాత్తుగా చనిపోవడంతో రెండు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి.