Share News

ఫొటోలు దిగి.. నీట మునిగి..

ABN , Publish Date - Mar 21 , 2026 | 04:09 AM

తెలంగాణ, ఏపీ సరిహద్దుల్లోని గోదావరిలో మునిగి ఐదుగురు యువకులు గల్లంతయ్యారు. ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. ప్రమాదం నుంచి బయటపడ్డ వారి మిత్రులు, పోలీసుల వివరాల ప్రకారం..

ఫొటోలు దిగి.. నీట మునిగి..

  • గోదావరిలో ఐదుగురు యువకుల గల్లంతు.. ముగ్గురి మృతదేహాలు లభ్యం

  • భద్రాచలం దగ్గర్లో ఏపీ సరిహద్దులో ఘటన

భద్రాచలం, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ, ఏపీ సరిహద్దుల్లోని గోదావరిలో మునిగి ఐదుగురు యువకులు గల్లంతయ్యారు. ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. ప్రమాదం నుంచి బయటపడ్డ వారి మిత్రులు, పోలీసుల వివరాల ప్రకారం.. ఏపీలోని కృష్ణాజిల్లా అమరావతి ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ, కేఎల్‌యూలో బీటెక్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఐదుగురు యువకులు గురువారం స్వామివారి దర్శనం కోసం భద్రాచలం వచ్చారు. రామయ్య దర్శనం చేసుకొని రాత్రి అక్కడే బస చేశారు. శుక్రవారం ఉదయం వారు భద్రాచలంలోని తమ ఇద్దరు స్నేహితులతో కలిసి తెలంగాణ-ఆంధ్రా సరిహద్దుల్లోని భద్రాచలానికి సమీపంలో ఉన్న కొల్లుగూడెం గోదావరి ఇసుక ర్యాంపు వద్ద స్నానాలు చేసి.. అనంతరం సరదాగా ఫొటోలు దిగాలని భావించారు. కానీ అక్కడ గోదావరిలో నీరు లేకపోవడంతో ఇసుకలో సుమారు రెండున్నర కిలోమీటర్లు నడిచి అవతలివైపు రాళ్లగుట్టలతో ఉన్న గోదావరి వద్దకు వెళ్లారు. అక్కడ కృష్ణాజిల్లా కలిదిండి గ్రామానికి చెందిన చండూరి దీపక్‌ మినహా మిగిలిన ఆరుగురు ఒకరి చేతులు ఒకరు పట్టుకొని నదిలో మధ్యలో ఉన్న రాళ్లగుట్టలపైకి వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ గోదావరి లోతును అంచనా వేయలేక నీళ్లలోకి జారారు. తొలుత ఏపీలోని కృష్ణా జిల్లా ఉయ్యూరుకు చెందిన తేజ్ఞ సాయి(19) మునిగిపోతుండగా అతడిని కాపాడేందుకు ఇతర స్నేహితులు ప్రయత్నించారు. ఈ క్రమంలో చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన పాశం సతీశ్‌ కుమార్‌(19), భద్రాచలానికి చెందిన చారుగుళ్ల శ్రీకర్‌ (21), పొడిచేటి అభిరామ్‌ (19), కృష్ణాజిల్లా ఉయ్యూరు చెందిన దగ్గుపాటి నవదీప్‌ (19) గల్లంతయ్యారు. విజయనగరానికి చెందిన గడ్డం హర్షవర్దన్‌ వారిని కాపాడేందుకు ప్రయత్నించే సమయంలో భయాందోళనకు గురై ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. అప్పటికే ఒడ్డున ఉన్న దీపక్‌తో పాటు హర్షవర్దన్‌ తీవ్ర భయాందోళనకు గురై గల్లంతైన చారుగుళ్ల శ్రీకర్‌ తండ్రి రామకృష్ణకు, పోలీసులకు సమాచారం అందించారు.


భద్రాచలంతో పాటు ఏపీలోని యటపాక, వేలేరుపాడు, కుక్కునూరు పోలీసు అధికారులు ఘటనా అక్కడికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. తెలంగాణ అగ్నిమాపక శాఖ రెస్క్యూ బృందంతో పాటు భద్రాచలం గోదావరి గజ ఈతగాళ్లు గాలింపు చర్యలను చేపట్టారు. గోదావరి నదిలో ఐదుగురు గల్లంతు కాగా అందులో ముగ్గురి మృతదేహాలు గజ ఈతగాళ్లకు లభ్యమయ్యాయి. దగ్గుపాటి నవదీప్‌, చారుగుళ్ల శ్రీకర్‌, పొడిచేటి అభిరామ్‌ మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతదేహాలను భద్రాచలం ఏరియా వైద్యశాలకు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతుల కుటుంబసభ్యుల రోదనలతో గోదావరి తీరం మిన్నంటింది. మృతుల్లో ఒకరైన భద్రాచలానికి చెందిన పొడిచేటి అభిరామ్‌ రామాలయంలో వైదిక సేవల్లో పాల్గొంటుండగా ఏప్రిల్‌లో అధికారికంగా వైదిక ఉద్యోగిగా విధుల్లోకి తీసుకోవాల్సి ఉందని దేవస్థానం వర్గాల ద్వారా తెలుస్తోంది. అభిరామ్‌ తాత భద్రాద్రి దేవస్థానం విశ్రాంత ప్రధాన అర్చకుడు పొడిచేటి రామచంద్రాచార్యులు కాగా తండ్రి వంశీ ఐటీసీలో మేనేజరుగా పని చేస్తున్నారు. చారుగుళ్ల శ్రీకర్‌ బీటెక్‌ ద్వితీయ సంవత్సరం చదువుతుండగా ఆయన తండ్రి వ్యాపార రంగంలో ఉన్నారు.

Updated Date - Mar 21 , 2026 | 04:10 AM