Share News

కార్మిక దినోత్సవాన విషాదం

ABN , Publish Date - May 02 , 2026 | 12:13 AM

చిట్యాలరూరల్‌, మే 1 (ఆంధ్రజ్యోతి): కార్మికుల దినోత్సవాన (మేడే) నల్లగొండ జిల్లాలో విషాదం నెలకొంది. పార్మా కంపెనీలో రియాక్టర్‌ పేలి ఒకరు మృతిచెందగా, ఏడుగురు కార్మికులకు గాయ్యాలయ్యాయి.

 కార్మిక దినోత్సవాన విషాదం

ఒకరు మృతి..

ఏడుగురికి గాయాలు నల్లగొండ జిల్లా లో ఘటన

చిట్యాలరూరల్‌, మే 1 (ఆంధ్రజ్యోతి): కార్మికుల దినోత్సవాన (మేడే) నల్లగొండ జిల్లాలో విషాదం నెలకొంది. పార్మా కంపెనీలో రియాక్టర్‌ పేలి ఒకరు మృతిచెందగా, ఏడుగురు కార్మికులకు గాయ్యాలయ్యాయి. శు క్రవారం నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు శివారులోని నోష్‌ ఫార్మా ల్యాబ్‌లో ఈ సంఘటన జరిగింది. కార్మికుల దినోత్సవాన పని చేయించడం, ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలవడంతో కార్మిక సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. సహచర కార్మికులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నల్లగొండ జిల్లా వెలిమినేడు శివారులోని నోష్‌ ఫార్మా ల్యాబ్‌లో బల్క్‌ డ్రగ్స్‌ ఉత్పత్తి చేస్తుంటారు. రోజువారీ పనుల్లో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం 3వ బ్లాకులో ఉత్పత్తి జరిగే సమయంలో ఎనిమిది మంది సిబ్బంది రియాక్టర్‌పై మూత బిగించారు. కొద్ది సమయంలోనే రియాక్టర్‌లో శబ్ధం రావడంతో పాటు పొగలు వస్తూనే ఒక్కసారిగా రియాక్టర్‌ పేలింది. పేలుడు ధాటికి గదిలోని పరికరాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. గదిలో మంటలు, పొగలు వ్యాపించడంతో ఆ బ్లాక్‌లో ఉన్నవారు, కంపెనీలో సిబ్బంది, ఇతర కార్మికులు బయటకు పరుగులు తీశారు. 3వ బ్లాకులో రియాక్టర్‌కు సమీపంలో ఉన్న చిట్యాల మండలం చిన్నకాపర్తికి చెందిన బొడ్డు బాలకృష్ణగౌడ్‌ (33)కు తీవ్రగాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. సమీపంలో ఉన్న ఎం.లింగస్వామి(పిట్టంపల్లి), ఎన్‌.శంకర్‌(పంతంగి), సీహెచ్‌.వరప్రసాద్‌ (సంస్థాన్‌నారాయణపురం), డేవిడ్‌ కుజుర్‌(ఝార్ఖండ్‌), ఎన్‌.వెంకటేశ్వరరావు(కోనసీమ), టి.లోకేశ్వర్‌రావు(మలిచర్ల),హనుమాన్‌గౌడ్‌(ఎల్‌బీనగర్‌)లకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను చౌటుప్పల్‌లోని ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని డీఆర్‌డీవో అపోలో ఆసుపత్రికి తరలించారు. తీవ్రగాయాలైన బాలకృష్ణగౌడ్‌ చికిత్స పొందుతూ మృతిచెందారు. పేలుడుకు మంటలు వ్యాపించడంతో సమీపంలోని వారు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. రియాక్టర్‌ పేలిన సమాచారాన్ని తెలుసుకున్న జిల్లా కలెక్టర్‌ బడుగు చంద్రశేఖర్‌, ఎస్పీ శరత్‌చంద్రపవార్‌, అదనపు కలెక్టర్‌, ఆర్డీవో యానాల అశోక్‌రెడ్డి, నల్లగొండ డీఎస్పీ కొలను శివరాంరెడ్డి నోష్‌ ల్యాబ్‌కు చేరుకున్నారు. 3వ బ్లాక్‌ను పరిశీలించి ప్రమాదానికి గల కారణాలను కంపెనీ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు.

నిర్లక్ష్యమా? పొరపాటుగా జరిగిందా?

23 రోజుల వ్యవధిలో రెండు సార్లు ప్రమాదం జరగడంతో జిల్లా కలెక్టర్‌ చంద్రశేఖర్‌, ఎస్పీ శరత్‌చంద్రపవార్‌ కంపెనీ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టి నిర్లక్ష్యమా? పొరపాటుగా జరిగిందా? అని తేలాక తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. యాజమాన్యంపై కేసు నమోదు చేస్తామని, విచారణ పూర్తయ్యేంత వరకు కంపెనీలో ఎలాంటి ఉత్పత్తి కార్యకలాపాలు చేయవద్దని ఆదేశించారు. ఉద్యోగులు, కార్మికుల రక్షణ భద్రతకు తగిన చర్యలు తీసుకోవడం యాజమాన్యం కర్తవ్యమని విచారణ నివేదిక వచ్చాక ప్రభుత్వానికి అందజేయనున్నట్లు తెలిపారు. అదే బ్లాకులో పనిచేస్తున్న కార్మికులకు స్వల్పగాయాలు కాగా వారిని కలెక్టర్‌, ఎస్పీ, అధికారులు పరామర్శించి ధైర్యాన్ని చెప్పారు.

నోష్‌ ల్యాబ్‌ను వెంటనే మూసివేయాలి

ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే రసాయన కంపెనీ నోష్‌ ల్యాబ్‌ను వెంటనే మూసివేయాలని స్థానికులు డిమాండ్‌చేస్తూ ఆందోళన వ్యక్తంచేశారు. భారీ పేలుడు సంభవించడం, ఆ శబ్ధానికి ఉవ్వెత్తున పొగలను ఎగిసిపడటంతో ఏం జరిగిందోనని తెలుసుకునేందుకు సమీప గ్రామాలైన పిట్టంపల్లి, బొంగోనిచెర్వు, వెలిమినేడు ప్రజలు అధిక సంఖ్యలో నోష్‌ల్యాబ్‌ కంపెనీ వద్దకు చేరుకున్నారు. కంపెనీకి, యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా చేశారు. వరుస ప్రమాదాలతో కార్మికులకు రక్షణ లేకుండా పోయిందని, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే రసాయన కంపెనీ నోష్‌ ల్యాబ్‌ను వెంటనే మూసివేయాలని డిమాండ్‌ చేశారు. కలెక్టర్‌, ఎస్పీ వారికి నచ్చజెప్పి ధర్నాను విరమింపజేయించారు.

23రోజుల వ్యవధిలో రెండుసార్లు ఘటన

గత నెల 9వ తేదీన నోష్‌ ల్యాబ్‌లో రియాక్టర్‌ సమీపంలో మంటలు చెలరేగిన ఘటన మరువకముందే తాజాగా రియాక్టర్‌ పేలింది. ఏప్రిల్‌ 9వ తేదీన ఘటనలో రెండో బ్లాక్‌లో ఉత్పత్తికి సంబంధించిన పదార్ధాన్ని విధుల్లో ఉన్న ఇద్దరు కార్మికులు నింపుతుడగా, నిప్పురవ్వలు చెలరేగి మంటలు వ్యాపించాయి. పేలుడు ధాటికి మంటలకు ఉద్యోగులు పరుగులు తీయగా ఇద్దరికి ముఖం, కాళ్ళు, చేతులు, శరీరానికి తీవ్రగాయాలై దుస్తులు కాలిపోయాయి.

భవనంపై నుంచి పడి కార్మికుడికి గాయాలు

మోత్కూరు, మే 1 (ఆంధ్రజ్యోతి): యాదాద్రి భువ నగిరి జిల్లా మోత్కూరు మండలం ముశిపట్ల గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఓ భవనానికి శుక్రవారం సెంట్రింగ్‌ చెక్క కొడుతుండగా ప్రమాదవశాత్తు జారి కింద పడి తీవ్రగాయాలయ్యాయి.గ్రామస్తులు, కార్మికుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం ..మే డే రోజు కార్మికులకు సెలవు రోజు అయినప్పటికీ అక్కడ ఒకటి, రెండు గంటల పని మాత్రమే ఉండటంతో త్వరగా ముగించుకుని వద్దామని సెంట్రింగ్‌ కార్మికులు పనికి వెళ్లారు. భవనానికి స్లాబ్‌ వేయడానికి సెంట్రింగ్‌ చెక్క కొడుతుండగా మోత్కూరు ఇందిరానగర్‌కు చెందిన సెంట్రింగ్‌ కా ర్మికుడు దాసరి నరేష్‌ ప్రమాదవశాత్తు భవనంపై నుంచి కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే చికి త్స నిమిత్తం అతన్ని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. భుజంవద్ద విరిగినట్టు చెబుతున్నారు

Updated Date - May 02 , 2026 | 12:13 AM